రోజు రోజుకీ సమాజంలో మానవత్వం అనేది కరువైపోతోంది. మనిషి బ్రతికుండా చాలా మంది విలువ ఇవ్వడం లేదు. కనీసం చనిపోయాక అయినా ఆ వ్యక్తికి విలువ ఇవ్వకపోవడం బాధాకరం. కరోనాతో చనిపోయాడని ఓ వ్యక్తి అంత్యక్రియలను కూడా స్థానికులు జరగనివ్వలేదు. ఆ అంత్యక్రియలు చేస్తున్న సదరు వ్యక్తి బంధువులపై కూడా దాడి చేయడం గమనార్హం. కాగా.. పాపం ఆ బంధువులు వారి దాడి నుంచి తప్పించుకునేందుకు సగం కాలిన శవంతో అక్కడి నుంచి పారిపోవడం గమనార్హం. ఈ దారుణ సంఘటన జమ్మూకశ్మీర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దొడా జిల్లాకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో అతడి అంత్యక్రియలను ఇంటి వద్ద నిర్వహించేందుకు బంధువులు అధికారుల అనుమతి కోరారు. అయితే స్థానిక డొమన ప్రాంతంలోనే కర్మకాండలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పడంతో బంధువులు అంగీకరించారు.

ఓ రెవిన్యూ అధికారి, ఇద్దరు పోలీసులు వెంటరాగా..వారు మృత దేహాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ చితికి నిప్పంటించారు. ఆ తరువాత కొద్ది సేపటికే స్థానికులు గుంపులుగా వచ్చి అక్కడ కర్మకాండ నిర్వహించరాదంటూ మృతుడి ఇద్దరు కుమారులు, భార్యతో గొడవకు దిగారు. వారిపై రాళ్లతో, కర్రలతో దాడికి కూడా దిగారని సమాచారం. 
దీంతో భయపడిపోయిన బంధువులు సగం కాలిన మృత దేహంతో అక్కడి నుంచి పారిపోయి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆ తరువాత అధికారుల సహాయంతో మరో శ్మశానవాటికలో దహనకార్యక్రమాలను పూర్తి చేశారు.


కాగా.. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి దిగుతున్న గుంపు నుంచి తమను అంబులెన్స్ డ్రైవర్ కాపాడని చెప్పారు. తమ వెంట వచ్చిన ఇద్దరు పోలీసులు స్థానికులను అదుపు చేయలేకపోయారని, రెవెన్యూ అధికారి కూడా అక్కడ కనిపించలేదని తెలిపారు.