సీఏఏ, నూతన వ్యవసాయ చట్టాలపై  విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: సీఏఏ, నూతన వ్యవసాయ చట్టాలపై విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.బీజేపీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్ లో మంగళవారం నాడు ప్రసంగించారు.

దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడం కోసమే విపక్షాలు ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సీఏఏ, నూతన వ్యవసాయ చట్టాలపై పుకార్లను విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు. దీని వెనుక ఉన్న రాజకీయాలను ప్రతి బీజేపీ కార్యకర్త అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ఇది పెద్ద కుట్రగా ఆయన అభివర్ణించారు.

దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడం దీని ఉద్దేశ్యమన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, మరికొన్నిసార్లు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ అబద్దపు ప్రచారాలుగా ఆయన గుర్తు చేశారు.1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1977లో అనేక పార్టీలతో విలీనమై జనతా పార్టీని ఏర్పాటైంది. 

1980లో జనతాపార్టీ జాతీయ కౌన్సిల్ ఆర్ఎస్ఎస్ తో పాటు జనతా పార్టీ సభ్యులుగా ఉండడాన్ని నిషేధించింది.దీంతో మాజీ జనసంఘ్ సభ్యులు 1980 ఏప్రిల్ 6న బీజేపీని ఏర్పాటు చేశారు.