న్యూఢిల్లీ: తన భర్త నపుంసకుడంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ అవమానించేలా వ్యవహరించిన ఓ మహిళపై డిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. భార్య మాటలు సదరు భర్త ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వున్నాయని... కాబట్టి దంపతులను విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. 

వివరాల్లోకి వెళితే న్యూడిల్లీకి చెందిన భార్యాభర్తలు కలహాల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భార్య మానసిక సమస్యతో బాధపడుతోందని భర్త విడాకులు కోరాడు. అయితే అతడి భార్య మాత్రం తన భర్త నపుంసకుడని... అందువల్లే విడాకులు కోరుతున్నట్లు తెలిపింది. భర్త సంసార జీవితానికి పనికిరాడంటూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదులో నిజానిజాలు తేల్చడానికి న్యాయస్థానం సదరు భర్తకు వైద్యపరీక్ష చేయించింది. అందులో అతడు సంసార జీవితానికి పనికి వస్తాడని...సపుంసకుడని మహిళ చేసిన ఆరోపణ అసత్యమని తేలింది. దీంతో భర్త కోరినట్లు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం.  

అయితే విడాకుల తీర్పును రద్దు చేసి తన భర్తతో కలిసుండే అవకాశం కల్పించాలంటూ సదరు మహిళ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే సమర్ధించింది. భర్తను నపుంసకుడంటూ తీవ్ర ఆరోపణలు చేసి తీవ్ర వేదనను కలుగజేసిన మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని ఆ వ్యక్తి భావించడం సహేతుకమేనని న్యాయస్థానం తెలిపింది.