అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసి.. అబ్బాయిలను వలలో వేసుకున్నాడు. తర్వాత ఎస్ఐ గా మరో అవతారం ఎత్తి.. ఆ అబ్బాయిలను బెదిరించి డబ్బులు గుంజాడు. చివరకు అడ్డంగా పోలీసుల ముందు బుక్కయ్యాడు. ఈ సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హుబ్లి నగరానికి చెందిన సిద్దప్ప ఫేస్ బుక్ లో భవిక పేరుతో నకిలీ ఖాతా తెరచి యువకులతో అమ్మాయినని చాటింగ్ చేసేవాడు. యువకుల మొబైల్ నంబర్లు తీసుకొని వాయిస్ ఛేంజర్ సాఫ్ట్ వేర్ తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన అనంతరం మరో కొత్త పథకానికి తెరలేపేవాడు. భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందంటూ పోలీసుల వేషదారణలో యువకులను బెదిరించి వారి వద్ద డబ్బులు గుంజేవాడు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది యువకుల వద్ద నుంచి డబ్బులు గుంజాడు.

ఇటీవల కొద్దిరోజుల క్రితం మైసూరు నగరంలోని శక్తి నగర్ కి చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నాడు. ఆమె మాట్లలో తన కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది. వెంటనే ఎస్ఐ అవతారం ఎత్తి.. ఆమె కొడుకు బెంగళూరులో యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని.. విచారణ నేపథ్యంలో ఇక్కడకు వచ్చానని ఆమెను నమ్మించాడు. రూ.50వేలు ఇస్తే నీ కొడుకును కేసు నుంచి తప్పిస్తానని చెప్పాడు.

అతని తీరు అనుమానం కలిగించడంతో ఆమె వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించింది. అంతే.. సిద్ధప్ప అడ్డంగా అసలు పోలీసులకు దొరికిపోయాడు. అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.