నకిలీ ఈడీ రైడ్.. రూ. 3 కోట్లు సీజ్.. నలుగురు ఫేక్ ఆఫీసర్లు అరెస్టు
ఢిల్లీలో ఓ నకిలీ ఈడీ రైడ్ జరిగింది. ఈడీ అధికారులుగా నమ్మించి ఓ ఇంటిలోకి దూరి ఫోన్లను అదుపులోకి తెచ్చుకుని తనిఖీలు ప్రారంభించారు. ఇంటిలో నుంచి రూ. 3 కోట్లు పట్టుకుని శనివారం ఆఫీసుకు వచ్చి దర్యాప్తులో పాల్గొనాలని పారిపోయారు. వారు వెళ్లిపోగానే బాధిత కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు వ్యక్తులు ఈడీ ఆఫీసర్లుగా నకిలీ అవతారం ఎత్తారు. ఓ ఇంటిపై రైడ్ కూడా చేశారు. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వేరే ఎవరికీ ఫోన్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ రైడ్‌లో రూ. 4 కోట్లను సీజ్ చేసుకున్నారు. కారులో వేసుకుని వేగంగా వెళ్లిపోయారు. వారిపై అనుమానంతో కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురిని అరెస్టు చేశారు. రూ. 1 కోటి స్వాధీనం చేసుకున్నారు.
ద్వారకాలో బాబా హరిదాస్ నగర్‌లోని ఓ ఇంటిలోకి కొందరు దుండగులు ఈడీ ఆఫీసర్లుగా అవతారమెత్తి దూరారు. ఇంటిలో హవాలా సొమ్ము ఉన్నదని తమకు సమాచారం వచ్చిందని బుకాయించారు. ఫోన్లు అదుపులోకి తీసుకుని రైడ్ చేసినట్టు గందరగోళం చేశారు. ఇంటిలో నుంచి రూ. 3 కోట్లు ‘సీజ్’ చేశారు. 30 నుంచి 40 నిమిషాల్లో రైడ్ పూర్తి చేశారు. ఈ ‘కేసు’లో దర్యాప్తునకు హాజరు కావడానికి శనివారం ఆఫీసుకు రావాలని వారిని ఆదేశించారు. వెంటనే ఇల్లు వదిలి వచ్చిన రెండు కార్లలో హడావిడిగా పారిపోయారు.
ఆ కుటుంబ సభ్యులకు వారి తీరుపై అనుమానం కలిగింది. తుపాకులు పట్టుకుని కనీసం ఆఫీసర్లుగా కూడా వారు కనిపించలేదు. వారి కార్లపైనా ఈడీకి సంబంధించిన సింబల్స్ ఏమీ లేవు. వారు వెళ్లిపోగానే వెంటనే రాత్రి 1.15 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వారు ఎటు వైపు వెళ్లిందీ తెలిపారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అటు వైపుగా వచ్చిన కార్లను తనిఖీలు చేయడం ప్రారంభించారు.
Also Read: కుష్టువ్యాధి కారణంగా వారిని కుటుంబాలు వదిలేశాయి.. కోలుకున్నాక 60 ఏళ్ల వయసులో వివాహం
ఒక కారు మాత్రం మరింత వేగంగా వెళ్లిపోతుండటాన్ని చూసి దాన్ని చేజ్ చేశారు. రెండు కిలోమీటర్ల దూరం చేజ్ చేసిన తర్వాత కారును అడ్డుకోగలిగారు. వెంటనే అందులోని నిందితుడు తుపాకీ తీసి కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే.. పోలీసులు ఆ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగారు. ఆ కారులో రూ. 70 లక్షలు లభించాయి. నిందితుడు అమిత్ అలియాస్ విక్కీని అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని పట్టుకున్నారు.
ద్వారకాలోని ప్లాట్‌ను అమ్మగా ఆ డబ్బులు వచ్చాయని బాధిత కుటుంబం తెలిపింది. తమకు డబ్బులు వచ్చినట్టుగా తెలిసిన ఓ వ్యక్తి ఈ నకిలీ రైడ్ వెనుక ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 1 కోటి సీజ్ చేసినట్టు పోీలసులు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపులు జరుపుతున్నట్టు వివరించారు.