FactCheck: కాశ్మీర్ ఫైల్స్ చూస్తూ సీఎం యోగి ఏడ్చారా? వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యానాథ్ ఏడుస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తున్న సందర్భంగా యోగి ఏడ్చారంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇందులో నిజమెంత? ఇది కాశ్మీర్ ఫైల్స్ కు సంబంధించిన వీడియోనేనా?
FactCheck: ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ అంశాల్లో "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా ఒకటి. 1990ల్లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా అందరి నుంచి ప్రశంసలను అందుకుంటోంది. సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ థియేటర్ కు వెళ్లారనీ, ఈ సినిమా చూస్తూ ఏడ్చారనీ, కంట నీరు పెట్టుకున్నారని పేర్కొంటూ ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజంగానే సీఎం యోగి కాశ్మీర్ ఫైల్స్ చూస్తూ ఏడ్చారా? వైరల్ అవుతున్న ఆ వీడియో లో వాస్తవమెంత?
ఇటీవల విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఏడుస్తున్నారనే తప్పుడు శీర్షికలతో యోగి ఆదిత్యనాథ్ షో చూస్తున్నట్లు కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధం లేదని asianetnews FactCheck లో తేలింది. వివరాల్లోకెళ్తే.. కాశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండల నేపత్యంలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తెరకెక్కింది. దీనిపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక బీజేపీ పాలిన రాష్ట్రాలు ఇప్పటికే ఈ సినిమాను పన్ను నుంచి మినాహాయింపును ప్రకటించాయి.
ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు కంట నీరు పెట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి వీడియో కూడా వైరల్ అయింది. 17 సెకనుల నిడివి ఉన్న ఆ క్లిప్‌లో యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకుని.. ఏడుస్తూ కనిపిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలోని పాట ఈ క్లిప్ వినిపిస్తోంది. "కాశ్మీర్ ఫైల్స్ చూస్తూ యోగి ఆదిత్యనాథ్ ఏడ్చారు. మీరందరూ ఒక్కసారి సినిమా చూడవలసిందిగా కోరుతున్నాము" అని పేర్కొంటూ ఆ వీడియో షేర్ చేస్తున్నారు.
అయితే, ఆ వీడియో 2017 అక్టోబర్ 17 రోజుకు సంబంధించినది గుర్తించడం జరిగింది. ఇదే వీడియో.. అమరవీరుల కోసం జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు అనే శీర్షికతో అప్పుడు వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్‌లో అమరవీరుల కోసం జరిగిన ఓ కార్యక్రమానికి యూపీ సీఎం హాజరైనా క్రమంలో.. ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారని 2017లో పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోకు కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఫేక్.