Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాక్ట్ చెక్ : ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా ? ఫేక్ వీడియో వైరల్ 

Fact-check: ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం మరో సారి స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చూపిస్తున్న వీడియో ఫేక్ అని తెలిపింది. 

Fact check: Viral video claiming EVMs can be hacked is FAKE news KRJ
Author
First Published Apr 16, 2024, 6:03 PM IST

Fact-check: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు సర్వసాధారణం. ఓటర్లను ప్రభావితం చేసే ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ తప్పుడు వీడియోను భారత ఎన్నికల సంఘం గుర్తించి, దానికి అడ్డుకట్ట వేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని యూట్యూబ్ క్లిప్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’ లో షేర్ చేసిన పోస్ట్ పై ఎన్నికలు సంఘం స్పందించింది. 

ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ చేయరాదని మరో సారి ప్రకటించింది. హ్యాకింగ్ కు గురైనట్లు వీడియోలో చూపించిన ఈవీఎం పోలింగ్ సంస్థకు చెందినది కాదని ఎన్నికల సంఘం తెలిపింది. ‘‘ఈ వాదన పూర్తిగా తప్పు, చూపించిన ఈవీఎం ఈసీఐ ఈవీఎంలు కాదు. వీడియోలో ఉన్న ఈవీఎంలు ఫేక్.. ఈసీఐ ఈవీఎంను హ్యాక్ చేయడం, తారుమారు చేయడం కుదరదు’’ అని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈవీఎం పనితీరును వివరిస్తూ ఈసీ తన వెబ్సైట్ నుంచి ఒక లింక్ ను కూడా షేర్ చేసింది. ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదని తెలిపింది. తాము ఉపయోగించే ఈవీఎంలు హ్యాక్ ప్రూఫ్ అని ఈసీ పేర్కొంది. ఈవీఎంలలో భద్రమైన కంట్రోలర్లు ఉన్నాయని, ఇవి వన్ టైమ్ ప్రోగ్రామింగ్ (ఓటీపీ) దశకు లోనవుతాయని, తదుపరి ప్రోగ్రామింగ్ ను నిరోధిస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. మైక్రో కంట్రోలర్ల గురించి సాంకేతిక వివరాలు తయారీదారుల వెబ్సైట్లలో బహిరంగంగా లభిస్తాయని చెప్పింది.

ఈవీఎం వ్యవస్థలకు మించి ఎలాంటి ఎక్స్ టర్నల్ వైర్డ్ లేదా వైర్ లెస్ కనెక్టివిటీ లేని స్వతంత్ర పరికరం అని ఈసీఐ పేర్కొంది. బ్యాలెట్ యూనిట్ (బీయూ), కంట్రోల్ యూనిట్ (సీయూ), ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లోని ప్రతి యూనిట్ డిజిటల్ సర్టిఫికేట్లను కలిగి ఉందని, అనుసంధానం చేసినప్పుడు పరస్పర ధృవీకరణకు లోనవుతుందని వివరించింది. అందువల్ల ఇలాంటి మరే యంత్రాన్ని ఈసీఐ-ఈవీఎంకు అనుసంధానం చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది.

ఈవీఎంల నిల్వ, రవాణా నుంచి ర్యాండమైజేషన్, కేటాయింపు, ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) నిర్వహణ, కమిషనింగ్, మాక్ పోల్స్, మెయిన్ పోల్స్, ఫలితాల కౌంటింగ్ వరకు ఈవీఎంల వినియోగంలో కఠినమైన సాంకేతిక, పరిపాలనాపరమైన రక్షణలు ఉన్నాయని ఈసీ అధికారులు తెలిపారు. అన్ని చర్యలు వాటాదారుల సమక్షంలోనే జరుగుతుండటంతో ఈవీఎం యూనిట్లకు అనధికారిక ప్రవేశం నిరోధించబడిందని అధికారులు చెప్పారు.

క్రమం తప్పకుండా మాక్ పోల్స్ నిర్వహిస్తామని, యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఈవీఎంలలో ఐదు శాతం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు కంట్రోల్ యూనిట్ (సీయూ) నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఫలితాలను వీవీప్యాట్ స్లిప్ కౌంట్ తో పోల్చి చూస్తామని చెప్పారు. దీంతో సెల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలకు కనెక్ట్ చేయడం, విడిభాగాలను మార్చడం వంటి వివిధ పద్ధతుల ద్వారా ఈవీఎంలను పలుమార్లు ప్రోగ్రామ్ చేయడం లేదా తారుమారు చేయడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios