కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం మన దేశంలోనూ విపరీతంగానే ఉంది. ఈ క్రమంలో వైరస్ ని అడ్డుకునేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ వచ్చారు. కాగా.. వాతావరణంలో మార్పుల కారణంగా మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధిస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే వార్తలు ఎక్కువగా కనపడుతున్నాయి.

లాక్ డౌన్ పేరు వినపడగానే.. ప్రజలు భయపడిపోతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించడం ఖాయమంటూ వార్తలు  వస్తున్నాయి. దీంతో.. ఈ వార్తలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. 

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తను కొట్టిపారేసింది. ఆ ట్వీట్‌ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మరోసారి లాక్‌డౌన్‌ విధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్ పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.