రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని అన్నానగర్ లో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతల సమావేశంలో ఆయన మార్గనిర్దేశం చేశారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ తన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే.. ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతామనా? లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోతున్నామా అనే విషయాన్ని ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ విషయంలో అధిష్ఠానం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బుధవారం అన్నానగర్‌లోని ఓ హోటల్‌లో పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర నిర్వాహకులతో కమల్‌హాసన్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 85 మంది జిల్లా కార్యదర్శులు, రాష్ట్రస్థాయి నిర్వాహకులు పాల్గొన్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే విషయమై పార్టీ నేతలతో కమల్ చర్చించారు. ఈ మేరకు పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోటీయా, లేక ఏదో ఒక కూటమితో కలిసి పని చేయాలా అన్నదానిపై కమల్ తమ పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని పార్టీ అధినేత సూచించారు.
అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తమ నేతలకు సూచించామన్నారు.
2024 ఎన్నికలపై తాము చర్చించామని, ఒంటరిగా బరిలో దిగాలా? లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై చర్చిమని తెలిపారు. ప్రస్తుతం ఈ దశలో ఏ విషయాన్ని పూర్తిగా వివరించలేమని హాసన్ అన్నారు. ఎన్నికల కోసం పని ప్రారంభించి పార్టీని బలోపేతం చేయాలని కమల్ హాసన్ కార్యకర్తలకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పొత్తు పెట్టుకున్నా లేదా ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశమున్న సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులు సరిదిద్దుకుని ముందుకెళ్తామని తెలిపారు.
ఇదిలా వుండగా మరోవైపు.. మొదటి నుంచి అన్నాడీఎంకే కూటమితో పొత్తును కమల్ విభేదించారు. కానీ, ఈ సారి ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలిసి బరిలో దిగబోతున్నారన ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో వున్న ఐజేకే ఈసారి బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ స్థానంలో ఎంఎన్‌ఎంను డీఎంకే దరి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
2018లో హాసన్ స్థాపించిన పార్టీ 2019 సాధారణ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 3.7 శాతం ఓట్లు రాగా, 2021 ఎన్నికల్లో అది 2.6 శాతానికి తగ్గింది. కోయంబత్తూరు (సౌత్)లో పోటీ చేసిన హాసన్ 1,700 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వనితా శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. వరుసగా ఎన్నికలలో పార్టీ పేలవమైన పనితీరు ప్రదర్శించడంతో పార్టీ సీనియర్ సభ్యులు ఇతర పార్టీలకు వలసలు వెళ్లారు.
