వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకుని దొంగచాటుగా ఆమెను కలుసుకునే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అగ్రిపదలో బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు తన మేనమామతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌‌లో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా ఆమెను కలుసుకోవడానికి ప్రతీ రోజు వివాహిత ఫ్లాట్‌కు వెళ్లేవాడు.

అలా వెళ్లి తిరిగి వస్తుండగా ఓ రోజు మేనమామ కంటబడ్డాడు. దీంతో ఆయన అల్లుడిని దండించడంతో పాటు గట్టి నిఘా పెట్టాడు. తన ప్రియురాలిని కలుసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో మేనమామ కంటబడకుండా అర్ధరాత్రి పూట దొడ్డిదారిలో వెళ్లేవాడు.

అలా ఓ రోజు ఆమె ఉంటున్న 9వ అంతస్తులోకి కిటికీల గుండా పైకి చేరుకున్నాడు. నానా తంటాలు పడి ప్రియురాలి వద్దకు చేరుకోగానే.. అక్కడ ఆమె భర్త ఉండటం గమనించాడు. దీంతో చేసేది లేక అదే కిటికీల గుండా  వెనక్కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు.

అయితే భారీ వర్షాల కారణంగా కిటీకి గోడలు, ఊచలు తడిచి ఉండటంతో పట్టుతప్పి కిందపడి పోయాడు. మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ నింపటానికి వెళ్లిన వాచ్‌మెన్ రక్తపు మడుగుల్లో ఉన్న యువకుడిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికీ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వివాహితను కలుసుకోవడానికి వెళ్లే ప్రయత్నంలోనే యువకుడు మరణించినట్లుగా ధ్రువీకరించారు.