Passport Seva: పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం భారతదేశం పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP-వెర్షన్ 2.0) యొక్క రెండవ దశను త్వరలో ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ దశలో అప్‌గ్రేడ్ చేసిన ఈ-పాస్‌పోర్ట్‌లు అందించనున్నట్టు  జైశంకర్ చెప్పారు. 

Passport Seva: విదేశాలకు వెళ్లాలని అనుకుంటే వారికి శుభవార్త. వాస్తవానికి విదేశాలకు వెళ్లడానికి వీసాకు ముందు పాస్‌పోర్ట్ అవసరం. అయితే.. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన పాస్‌పోర్ట్ ఉంటుంది. కొన్ని సార్లు మనం కొన్ని దేశాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటాం. అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ..పాస్ పోర్టు సేవాలను మరింత సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా నూతన, అప్‌గ్రేడ్ చేసిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

భారత్ త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (PSP-వెర్షన్ 2.0) రెండవ దశను ప్రారంభించబోతోంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన ఈ-పాస్‌పోర్ట్‌లను అందించనున్నారు. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సేవలతో ప్రజలు సులువుగా, అప్‌గ్రేడ్ ప్రాతిపదికన పాస్‌పోర్ట్‌ను పొందవచ్చని, విదేశాలకు వెళ్లే వారి ప్రణాళికను నెరవేర్చుకోవచ్చని ఆయన అన్నారు. దేశ, విదేశాల్లోని పాస్‌పోర్టు జారీ చేసే అధికారులకు విజ్ఞప్తి చేస్తూ.. పాస్‌పోర్టు సంబంధిత సేవలను సకాలంలో, విశ్వసనీయంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలని సూచించారు. తాజా వెలువడనున్న పాస్ పోర్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో అందుబాటులోకి తీసుకరానున్నారు.

ప్రధానమంత్రి ఈజ్ ఆఫ్ లైఫ్ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా డిజిటల్ ఎకో సిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. దీని కింద, ఈ-పాస్‌పోర్ట్ సేవలు, కృత్రిమ మేధతో నడిచే సర్వీస్ డెలివరీ, చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించడం ద్వారా ప్రజలు సులభంగా విదేశాలకు ప్రయాణించగలరు. ఈ టెక్నాలజీతో డేటా భద్రత కూడా పటిష్టం కానున్నదని తెలిపారు . పాస్‌పోర్ట్ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందించడమే కొత్త చొరవ లక్ష్యం అని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇది ఇప్పటికే ఉన్న ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందనీ, భవిష్యత్తులో మరింత మెరుగైన సాంకేతికతను వినియోగించుకుంటామని చెప్పారు.

ఇ-పాస్‌పోర్ట్ సేవ అంటే ఏమిటి? 

ఇ-పాస్‌పోర్ట్ సేవ 2.0 కింద బయోమెట్రిక్స్ సాంకేతికత ఉపయోగించబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ డేటా అనాలిసిస్, చాట్ బాట్, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఉపయోగించనున్నారు. ఇది పాస్‌పోర్ట్‌ను పొందడం సులభతరం చేస్తుంది . ఇది డేటాకు మెరుగైన భద్రతను కూడా ఇస్తుంది. ఇ-పాస్‌పోర్ట్ సేవ కోసం సాఫ్ట్‌వేర్‌ను ఐఐటి కాన్పూర్, ఎన్‌ఐసి అభివృద్ధి చేశాయి.