Agnipath Scheme Age Limit Extended: కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పొడగించింది.
Agnipath Scheme Age Limit Raised: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం యొక్క వయోపరిమితిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపిక అయ్యేవారి గరిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలకు పెంచింది. అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆవిష్కరించింది. తొలుత ఈ పథకం ద్వారా నియమితులయ్యే వారి ప్రవేశ వయస్సు 17 మరియు 21 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొంది.
అయితే, గత రెండేళ్లుగా కరోనావైరస్ కారణంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నియామకాలు చేపట్టకపోవడంతో కేంద్ర బలగాల్లో చేరేందుకు ఎదురుచూస్తూ వయో పరిమితిని కోల్పోయారు. దీంతో ఈ పథకంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు దళాల్లో చేరాలనుకునే ఆశావహులు. ఈ క్రమంలో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వాస్తవాలను స్పష్టం చేసింది. పథకం గురించి వ్యాప్తి చెందుతున్న గందరగోళం, విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. సైన్యం యొక్క రెజిమెంటల్ వ్యవస్థలో ఎటువంటి మార్పు ఉండబోదని, సైన్య సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టడం సాధ్యం కాలేదనే వాస్తవాన్ని గుర్తించి, ఇలా వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయిన వారిని దృష్టిలో పెట్టుకుని, 2022 ఏడాదికిగాను మరో రెండేళ్ల వయస్సు మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
అగ్నిపథ్ పథకం
దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 14న 'అగ్నీపథ్' పేరుతో పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందులో నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో యువతను రిక్రూట్ చేసుకుంటారు. ఈ పథకం కింద ఎంపికైన యువతను 'అగ్నివీర్' అని పిలుస్తారు. ఈ సంవత్సరం సుమారు 46,000 మంది యువకులు సహస్త్ర దళాలలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అగ్ని వీర్ల వయస్సు 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుంది. జీతం గురించి మాట్లాడితే.. అగ్నివీర్లకు నెలకు 30 నుండి 40 వేల జీతం ఇవ్వనున్నారు. ప్రణాళిక ప్రకారం.. రిక్రూట్ చేయబడిన యువతలో 25 శాతం మందికి సైన్యంలోకి తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మంది ఉద్యోగాన్ని వదిలివేయవలసి ఉంటుంది. ఒకవైపు అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమంగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు, ప్రతిపక్ష పార్టీతో పాటు, అనేక రాష్ట్రాల్లో యువత ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నిరసనల వెల్లువ
అనేక రాష్ట్రాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా యువత నిరసనలు చేపట్టాయి. బీహార్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో జరిగిన ఆందోళన గురువారం దేశంలోని అనేక నగరాలకు చేరుకుంది. జైపూర్, ఉత్తరాఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శనలు చేశారు.
జైపూర్‌లో నిరసనకారులలో పాల్గొన్న యువకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సైన్యంలో శాశ్వత రిక్రూట్‌మెంట్‌కు బదులుగా, కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేబడుతోందని అన్నారు. ఈ పథకంతో యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని, యువతకు హాని కలిగించడమే కాకుండా, సైన్యం గోప్యతను కూడా ఉల్లంఘించవచ్చని నిరసనలు చేపట్టారు.
