న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్‌ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అయితే జైట్లీకి గుండెపోటు రాలేదని వైద్యపరీక్షల నిమిత్తం మాత్రమే వచ్చారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

ఇకపోతే ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ లతోపాటు పలువురు కేంద్రమంత్రులు పరామర్శించారు. 

అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వ్యైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

అరుణ్ జైట్లీకి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల స్పెషలిస్ట్ లు వైద్య సేవలు అందిస్తున్నారు. అరుణ్ జైట్లీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆదేశించారు.  

గత కొంతకాలంగా అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మోదీ మెుదటిసారి ప్రధాని అయిన తర్వాత ఆయన కేబినెట్లో గతంలో ఆర్థికమంత్రిగా  ఉన్నపుడే అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. 

2019 సార్వత్రిక  ఎన్నికల్లో బీజేపీ ఘన  విజయం సాధించిన అనంతరం కూడా ఆయన ఎలాంటి పదవులను ఆశించలేదు. అనారోగ్యం  కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ సైతం రాశారు.  

అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ అరుణ్ జైట్లీని బ్రతిమిలాడారు. నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి మరీ మాట్లాడారు. ఆయనకు విశ్రాంతి అవసరమని నిర్ధారించుకున్న తర్వాత ఆయనను మంత్రి వర్గంలో తీసుకోలేదు. ఇకపోతే ఆనాటి నుంచి మీడియా ముందుకు గానీ, పార్టీ కార్యక్రమాలకు గానీ దూరంగా ఉంటున్నారు అరుణ్ జైట్లీ. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.