ఓ క్యాబ్ డ్రైవర్ మంచితనానిని మాజీ ట్విట్టర్ ఎండీ ఫిదా అయ్యారు. డబ్బులు ఇవ్వడం మరిచిపోయినా.. చాలా పొలైట్ గా వ్యవహరించి.. డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడంటూ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ : మాజీ ట్విట్టర్ ఎండీ పర్మీందర్ సింగ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ కు అతను డబ్బులు ఇవ్వడం మరిచిపోయాడు. ఆ తరువాత తప్పును తెలుసుకుని అతనికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా.. అతను చాలా సహృదయంతో స్పందించాడు. పర్లేదు సార్.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. మీరు కావాలని చేయలేదు కదా.. ఉండనివ్వడం.. మళ్లీ వచ్చినప్పుడు ఇద్దురు.. అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. పర్మీందర్ సింగ్ మాజీ ట్విట్టర్-ఆసియా మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఘటన ఆయనను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన చాలా నచ్చింది. దీంతో ఆ మాజీ ట్విట్టర్ ఎండీ ఈ ఘటన మొత్తాన్ని తన అకౌంట్ లో ట్వీట్ చేశారు. దీని ప్రకారం.. ఓ క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఢిల్లీ విమానాశ్రయంలో దించేశాడు. విమానం ఎక్కే హడావుడిలో మేము అతనికి డబ్బులు చెల్లించకుండానే దిగి వెళ్లిపోయాం. లోపలికి వెళ్లాక గుర్తుకువచ్చింది. వెంటనే అతడికి కాల్ చేసి సారీ చెప్పి, డబ్బులు ఎలా పంపాలని అడిగాం. అతను 'కోయి బాత్ నహీ, ఫిర్ కభీ ఆ జాయేంగే' అని బదులిచ్చాడు.
సమీప బంధువును హత్య చేసి.. తలతో సెల్ఫీ.. జార్ఖండ్ లో దారుణం..
క్యాబ్ లో కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి ‘మేము భారత్ లో ఉండమని.. సింగపూర్‌లో నివసిస్తున్నామని డ్రైవర్‌కు తెలుసు’ అని సింగ్ పేర్కొన్నాడు. అంతేకాదు తన ఫాలోవర్స్ లో ఎవరైనా ఓ మంచి డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లైతే తనకు పర్సనల్ గా డీఎం చేయాలని అతని వివరాలు షేర్ చేస్తానని తెలిపారు. పబ్లిక్ గా అతని వివరాలు తెలపడానికి నాకు అనుమతి లేదని గమనించండి అని కూడా తెలిపారు.
దీనిమీద సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ వస్తోంది. నెటిజన్స్ తన అనుభవాలను కూడా పంచుకున్నారు. ‘భారత్ లో ఇలాంటి మంచి ఘటనలు ప్రతీరోజూ లక్షల సంఖ్యలో జరుగుతూనే ఉంటాయి’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు.. ఇలాంటి వాటిని కాకుండా వివాదాస్పద అంశాలమీదే మీడియా దృష్టిపెడుతుంది. ఇలాంటివి రిపోర్ట్ చేస్తే ఎంతో మంది మంచి మనుషులు వెలుగులోకి వస్తారు..అంటూ కామెంట్ చేశారు.
తమకు కూడా ముంబైలో ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందని మరో యూజర్ చెప్పుకొచ్చారు. మాటల్లో పడి అది పంజాబ్ పోలీసు కారు కాదు.. క్యాబ్ అని మరిచిపోయాం... డబ్బులు చెల్లించకుండానే దిగి వెళ్లిపోయాం. ఆ తరువాత మళ్లీ ఆ క్యాబ్ డ్రైవర్ ను వెతికి పట్టుకుని పది శాతం అదనంగా చెల్లించా.. అని చెప్పుకొచ్చారు.
చాలామంది క్యాబ్ డ్రైవర్లు చాలా మంచివారు. వారిలోని ఈ మంచితనమే మన ప్రయాణాలను సుఖవంతం చేస్తుంది అన్నారు. దీనికి సింగ్ స్పందిస్తూ నిజమే అతనిలోని మంచితనం మమ్మల్ని బాగా ఆకర్షించింది. మేము కూడా అదే పని చేశాం అని చెప్పుకొచ్చారు. సింగ్ నవంబర్ 2013 నుండి డిసెంబర్ 2016 వరకు ట్విట్టర్-ఆసియా ఎండీగా ఉన్నారు.
