అర్థరాత్రి దాటినా టీవీ ఆఫ్ చేయడం లేదంటూ తండ్రిని గన్ తో కాల్చి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టీవీ ఆఫ్‌ చేయమంటే ఆఫ్‌ చేయలేదన్న కోపంతో తండ్రిని కాల్చి చంపాడో మాజీ ఆర్మీ ఉద్యోగి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అశోక్‌ కథిహార్‌  నసీర్‌పుర్‌లో నివాసం ఉంటున్నాడు. తండ్రి లాలా రామ్‌ కూడా అతని దగ్గరే ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి లాలా రామ్‌ టీవీ చూస్తున్నాడు. 

అర్థరాత్రి దాటినా టీవీ చూస్తూనే ఉన్నాడు. నిద్రకు భంగం కలుగుతుందని, టీవీ ఆఫ్‌ చేయాల్సిందిగా అశోక్‌ తండ్రిని అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. 

అది హద్దులు దాటడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అశోక్‌ తన దగ్గరున్న లైసెన్స్‌డ్ డబుల్‌ బ్యారెల్‌ గన్‌తో తండ్రిని కాల్చి చంపాడు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పరారీలో ఉన్న అశోక్‌ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, అశోక్‌ బాగా తాగేవాడని, చీటికీ మాటికి ఇంట్లో వారితో గొడవ పడే వాడని కుటుంబసభ్యులు తెలిపారు.