న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహాన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ బలంగా తమ వాణిని వినిపించాలనే నిర్ణయంతో ప్రధాని మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. 

రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆగస్టు 13న మన్మోహన్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రచారం. మన్మోహన్ సింగ్ గతంలో కూడా రాజ్యసభ నుంచి ప్రాంతినిథ్యం వహించారు. 

ప్రధానిగా రెండు పర్యాయాలు పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆసమయంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగానే ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్లపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ప్రధానమంత్రి పదవి అయిపోయిన అనంతరం మన్మోహన్ సింగ్ అంతగా తెరపైకి రావడం లేదు. సీడబ్ల్యూసీ, లేదా ఇతర కీలక భేటీలకు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.