ఢిల్లీ: మాజీప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మన్మోహన్ సింగ్. నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఇతర పార్టీ సభ్యులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయని నేపథ్యంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ లు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మన్మోహన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

బీజేపీకి రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్‌ సైనీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించలేదు. దాంతో మన్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇకపోతే  గత మూడు దశాబ్దాలుగా మన్మోహన్‌ అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే అసోంలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేకపోవడంతో ఈసారి రాజస్థాన్‌ నుంచి మన్మోహన్‌ పెద్దల సభకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2019 జూన్ 14 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. పదవీకాలం పూర్తవ్వడంతో తిరిగి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దాంతో రాజస్థాన్ నుంచి బరిలోకి దించింది.  2024 ఏప్రిల్‌ 3 వరకూ మన్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.