ఎంపీలకు చీరలు, గాజులు పంపుతానంటూ కర్ణాటక మాజీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.. వదర బాధితులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ పరిహారం ఇవ్వాలని.. అందుకోసం ఈనెల 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నానని.. లేదంటే..  రాష్ట్రంలోని ఎంపీలకు ఇలకల్‌ చీర, జాకెట్, గాజులు, కుంకుమను కొప్పళ జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పంపుతానని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు శివరాజ్‌ తంగడిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన బుధవారం కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. వరదల వల్ల రాష్ట్రంలో రూ.38 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నష్టాన్ని భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులను ఆదుకోవాలన్నారు.   

రాష్ట్రంలో ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో బీజేపీ వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వరద బాధితుల సహాయార్థం నిధులు కోరని పక్షంలో ఈ దేశ ప్రధానమంత్రి నరెంద్ర మోదీ ముందు చీర, జాకెట్, గాజులు, కుంకుమ ధరించి కనిపించాలని హితవు పలికారు. అప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి జరిగిన నష్టం గుర్తుకొస్తుందన్నారు.