పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి భారత ఆర్మీ తెగువ చూపించిందని.. దానిని ప్రధాని మోదీ తన ప్రచారం కోసం వాడుకుంటున్నారని కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు ఆరోపించారు. మంగళవారం ఉదయం భారత ఆర్మీ.. పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా..దీనిపై పల్లంరాజు స్పందించారు.

భారత వాయుసేన మెరుపుదాడులు గర్వకారణమన్నారు.  భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఒక విధానంగా పాకిస్థాన్‌ మలుచుకుందని, పాక్‌లోనే కాదు.. మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్‌ దాడులు చేయాలని ఆయన సూచించారు. భారత ప్రతీకార చర్యకు ప్రస్తుతం అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని,  అయితే, ఇది వెంటనే సంతోషించాల్సిన విషయం కాదన్నారు. 

పాకిస్థాన్‌కు యుద్ధం చేసి గెలిచే అవకాశం లేనందున ఆ దేశం ఉగ్రవాద దాడులు చేసేందుకు తెగబడే ప్రమాదం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని సూచించారు.

ఈ సర్జికల్ స్ట్రైక్స్ మోదీ చేయలేదని.. భారత ఆర్మీ చేసిందని గుర్తు చేశారు. భారత్ ఆర్మీ తెగువను మోదీ ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.  కశ్మీర్ ప్రజల మద్దతు పోగొట్టుకోవడమే మోదీ ప్రభుత్వ వైఫల్యమన్నారు. అందుకే పుల్వామా, ఇతర ఉగ్రదాడులు మితిమీరాయని అభిప్రాయపడ్డారు.