కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనలోని డ్యాన్స్ కళను మరోసారి బయటపెట్టారు. తన స్వగ్రామంలో జరిగిన సిద్ధరామేశ్వర స్వామి జాతరలో వీర కునిత నృత్యం చేశారు.

జాతరలు, పెళ్లి వేడుకలు, ఇతర సెలబ్రేషన్స్‌లో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు డ్యాన్స్ వేసిన సందర్భాలు ఎన్నో. దీంతో అభిమానులు కేరింతలు కొడుతూ వుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య. మైసూరులోని సిద్ధరమణ హుండి సిద్ధరామయ్య స్వగ్రామం. కాగా, నిన్న సొంతూర్లో జరిగిన సిద్ధరామేశ్వర స్వామి (siddharameshwara swamy) జాతరకు ఆయన కూడా హాజరయ్యారు. అంతేకాదు, తన చిన్ననాటి స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశారు. కొందరు జానపద గీతాలు ఆలపిస్తుండగా, సిద్ధరామయ్య పంచె ఎగ్గట్టి మరీ డ్యాన్స్ చేశారు. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా స్టెప్పులు వేయగలిగారు సిద్ధరామయ్య. 

ఈ వీడియోను సిద్ధూ తనయుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయితే సిద్ధరామయ్య తనలో నృత్య కళను చూపించడం ఇదే కొత్త కాదు. 2010లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘బెల్లారీ చలో’ పాదయాత్ర సందర్భంగా వీరగషే అనే జానపద నృత్యం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాగా.. కొద్దిరోజుల క్రితం గుజ‌రాత్‌లోని (gujarat) పాఠ‌శాల‌ల్లో భగవద్గీత (bhagavad gita) ప్ర‌వేశ‌పెడుతున్న అంశంపై సిద్ధ‌రామయ్య (siddaramaiah) స్పందించారు. తాను ఏ మత గ్రంథాలకు కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కానని స్పష్టం చేశారు. మ‌న దేశానిది భిన్నమైన సంస్కృతి అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మ‌నం సమైక్య జీవన విధానంలో ఉన్నామని .. తాము హిందూ ధర్మంపై నమ్మకం కల్గినవారమ‌ని తెలిపారు. పాఠశాల పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధరామయ్య చెప్పారు. 

తాము రాజ్యాంగపరంగా లౌకిక‌వాద‌ విధానాలను నమ్ముతామని స్పష్టం చేశారు. బ‌డుల్లో భగవద్గీతతో పాటు ఖురాన్‌ (THE QURAN) , బైబిల్‌ను (holy bible) విద్యార్థులకు నేర్పినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిద్ధూ తేల్చిచెప్పారు. విద్యార్థులకు అవసరమైనది గుణాత్మకమైన విద్య అని ఆయన వ్యాఖ్యానించారు. భగవద్గీతను మ‌న‌ ఇళ్లలో పిల్లలకు చెబుతారని .. రామాయణ, మహాభారతం వంటివాటిని కూడా పిల్లలకు నేర్పుతార‌ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. నైతిక విద్య అవసరమని, కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడ‌ద‌ని స్పష్టం చేశారు. 

Scroll to load tweet…