Chandrayaan 3: చంద్రయాన్-3 ఓ గేమ్-ఛేంజర్ గా మారుతుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ అభివర్ణించారు. ఈ ప్రయోగం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

Chandrayaan 3: చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ చంద్రయాన్ - 3. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దమైంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రయోగానికి సంబంధించి గురువారం కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. ఈ ప్రయోగం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరుగనున్నది. లాంచ్ వెహికల్ మార్క్ - ఎల్‌వీఎం3 - ఎం4 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లనున్నది. ఇక మరి కొన్ని గంటల్లోనే చంద్రయాన్ - 3 జాబిల్లి వైపు ప్రయాణించనుంది.

ఈ తరుణంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ఖచ్చితంగా భారత్‌కు గేమ్‌చేంజర్‌గా మారుతుందని, ఈ ప్రయోగం విజయవంతమవుతుందని అన్నారు. భారతదేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా మారుతుందనీ, లాంచ్ కోసం వేచి ఉండండి. మంచి కోసం ప్రార్థిద్దామని పేర్కొన్నారు. విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండింగ్' చేసిన ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశాన్ని మారుస్తుందని, దేశంలో అంతరిక్ష శాస్త్ర అభివృద్ధికి అవకాశాలను పెంచుతుందని అన్నారు. 

ఈ ప్రయోగం ద్వారా.. ఆర్థిక వ్యవస్థను, అంతరిక్ష రంగంలో వృద్ధిని పెంపొందించడమే కాకుండా, 600 బిలియన్ డాలర్ల పరిశ్రమలో భారతదేశ వాటాను ప్రస్తుత 2 శాతం నుండి మెరుగుపరుస్తుందని నారాయణన్ అన్నారు. ప్రధాన అంతరిక్ష యాత్రలను చేపట్టేందుకు చైనాతో లేదా చైనా లేకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరహాలో ఆసియా అంతరిక్ష సంస్థ (ASA)ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నంబి నారాయణన్ నొక్కి చెప్పారు.

భారతదేశం ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నందున, ఈ రంగంలో మరిన్ని స్టార్టప్‌ల ప్రవేశానికి అవకాశం పెరుగుతుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త చెప్పారు. అనేక ఇతర దేశాలు కూడా తమ స్టార్టప్‌లతో ఇక్కడికి రావచ్చు లేదా ఇప్పటికే ఉన్న స్టార్టప్‌లలో చేరవచ్చునని తెలిపారు. విజయవంతమైన 'చంద్రయాన్-3' మిషన్ అంతరిక్ష శాస్త్రం , సాంకేతికతతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ అవుతుందని నారాయణన్ అన్నారు. 

'చంద్రయాన్-2' చంద్రునిపై ల్యాండ్ చేయగలిగిందే.. కానీ.. కొన్ని సాఫ్ట్‌వేర్, మెకానికల్ సమస్యల కారణంగా 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయడంలో విఫలమైంది. ఇప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తలు నాలుగేళ్లుగా ఇందులోని ప్రతి అంశంపై కృషి చేశారని, తాము ‘సాఫ్ట్ ల్యాండింగ్’ను ఆశిస్తున్నామని నారాయణన్ చెప్పారు.

దేశం ముందుకు సాగాలంటే.. దేశీయంగా అభివృద్ధి చెందిన సాంకేతికత అవసరమన్నారు. ఇస్రో తన ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రల కోసం కనీస మొత్తాన్ని ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందిందని నారాయణన్ అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇలాంటి మిషన్‌లపై మన ఖర్చు చాలా తక్కువ అని మాజీ శాస్త్రవేత్త చెప్పారు. నారాయణన్ మాట్లాడుతూ.. మిషన్ విజయవంతమవడానికి ఆగస్టు 23 లేదా 24 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు.

చంద్రయాన్-3 ప్రయోగం ఎప్పుడు?

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నారు. ప్రయోగానికి ఒక రోజు ముందు.. ఇస్రో శాస్త్రవేత్తల బృందం చంద్రయాన్-3 సూక్ష్మ నమూనాను మోసుకెళ్లి తిరుపతి తిరుపతి ఆలయాన్ని సందర్శించింది.