ఆ అధికారి సర్వీసు కాలం 2028 వరకూ ఉన్నది. కానీ, ఈ ఏడాది మార్చి 23న ఆయన పదవీ విరమణ తీసుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. మిగిలిన కాలానికి ఆయన సేవలు చేయడానికి అనర్హుడని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమితాబ్ ఠాకూర్ యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహప్రతివ్యూహాలపై చర్చలు జరుపుతున్నాయి. బీజేపీ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. కేంద్రంలో మరోసారి అధికారాన్ని కొనసాగించాలనుకుంటే అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీలో గెలుపొందడం అవసరం. అదిగాక, 2024 జనరల్ ఎన్నికలకు యూపీ ఎన్నికలు ప్రీఫైనల్‌గా భావించడమూ ఈ ఎలక్షన్ ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఈ తరుణంలోనే బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై పోటీ చేయనున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
యూపీ క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ సీఎం యోగిపై పోటీ చేయనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎన్నో అప్రజాస్వామిక, అణచివేత, దోపిడీ, వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకున్నారని వారు ఆరోపించారు. అందుకే సీఎం యోగిపై అమితాబ్ పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అమితాబ్ కూడా అక్కడి నుంచి నామినేషన్ వేస్తారని పేర్కొన్నారు.
మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బలవంతంగా ఆయనకు రిటైర్‌మెంట్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 23న కేంద్ర హోం శాఖ అమితాబ్ రిటైర్‌మెంట్ సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అమితాబ్‌కు తప్పనిసరి రిటైర్‌మెంట్ ఇస్తున్నట్టు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. మిగతా సర్వీసు కాలంలో ఆయన కొనసగించడానికి అర్హుడు కాదని స్పష్టం చేసింది. 2028 వరకు అమితాబ్‌కు సర్వీసు కాలం ఉన్నది.
2017లో ఆయన క్యాడర్ రాష్ట్రాన్ని మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ తనను బెదిరిస్తున్నారంటూ అమితాబ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే జులై 13న అమితాబ్‌పై సస్పెన్షన్ వేటువిధించినట్టు కేంద్రం తెలిపింది. ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీని నిర్వహించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లక్నో బెంచ్ సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధించింది. కానీ, కేంద్ర హోం శాఖ ఈ ఏడాది ఆయనకు బలవంతంగా రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఆదేశించింది.
