లక్నో: బులంద్‌షహర్ ఘటనపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మరో సవాల్ ఎదురైంది. బులంద్ షహర్ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని 83 మంది మాజీ ఉన్నతాధికారులు డిమాండ్ చేశారు. 

విదేశాంగశాఖ మాజీ కార్యదర్శులు శ్యాంశరణ్, శివశంకర్ మీనన్ లతో సహా 83 మంది మాజీ ఉన్నతాధికారులు ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. గోవధ పేరిట కొందరు దాడి చేశారని, ఆ దాడిలో ఇన్ స్పెక్టరు సుబోద్ కుమార్ సింగ్ సహా మరో వ్యక్తి మరణించాడని వారు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

మతపరమైన అల్లర్లను అణచివేయకుండా గోవులను వధించే వారిపై చర్యలు తీసుకున్నారని వారు ఉన్నతాధికారులు లేఖలో ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భజరంగ్ దళ్ కు చెందిన నాయకుడని పేర్కొన్నారు. 

అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా మాజీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్, అరుణారాయ్, హర్షమందిర్, ప్రసారభారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్, ప్రణాళిక సంఘం మాజీ కార్యదర్శి ఎన్ సీ సక్సేనాలు సంతకాలు చేశారు. 

దీనిపై అలహాబాద్ హైకోర్టు న్యాయ విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు కోరారు. మెుత్తానికి దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా 83 మంది మాజీ ఐఏఎస్ లు ఇలా బహిరంగ లేఖ రాయడం సీఎం రాజీనామాకు పట్టుబుట్టడం ఇదే మెుదటిసారి కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.