కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోనున్నారు. కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు.. మాజీ సీఎం యడియూరప్ప తర్వాత అంతటి గుర్తింపు వుంది.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్లు దక్కని అసంతృప్త నేతలు బీజేపీ అధిష్టానానికి షాకిస్తున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు కూడా వుండటంలో వీరిని సెట్ చేయడానికి బీజేపీ ట్రబుల్ షూటర్లు నానాతంటాలు పడుతున్నారు. టికెట్లు దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ వుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధ్రువీకరించారు. బీజేపీ తనకు అవమానం జరిగిందని లక్ష్మణ్ భావిస్తున్నారని.. ఇలాంటి నేతలకు మా పార్టీలో చోటు వుంటుందని శివకుమార్ పేర్కొన్నారు. 9 నుంచి 10 మంది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని.. కానీ వారందరికీ సీట్లు కేటాయించలేమని డీకే తేల్చిచెప్పారు. 

మరోవైపు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్.. ఈరోజు మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సూర్జేవాలాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ తరపున ఎమ్మెల్సీగా వున్నందున ఆయన తన పదవికి రాజీనామా చేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరతారని డీకే శివకుమార్ పేర్కొన్నారు. 

Also Read: బీజేపీకి వ‌రుస షాక్ లు.. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో రగడ

కర్ణాటకలోని బెళగావి జిల్లా అథని నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి ఎన్నికల్లో ఆయన ఎవరి చేతుల్లో ఓడిపోయాడో అతను (కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేశ్) బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో మహేశ్‌కే బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో లక్ష్మణ్ అలకబూనారు. కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు.. మాజీ సీఎం యడియూరప్ప తర్వాత అంతటి గుర్తింపు వుంది. అలాంటి వ్యక్తి ఎన్నికల సమయంలో పార్టీని వీడటం బీజేపీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు.