తన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన ఓ మాజీ ఆర్మీ అధికారి... ఈ ప్రయంత్నంలో తన ప్రాణాలు కోల్పోయారు. తన ఇంటి పక్కన ఓ దుకాణంలో చోరీ జరుగుతుండగా చూసిన ఆయన దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా... దుండగులు ఆయనను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి మాజీ ఆర్మీ అధికారి అమానుల్లా, అతని భార్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా... ఆ సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న దుకాణంలో దొంగలు పడ్డారు. గమనించిన అమానుల్లా దొంగల ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను పిలుస్తానంటూ దొంగలను హెచ్చరించారు. 

దీంతో.. కోపంతో ఊగిపోయిన ఆ దుండగులు... కర్రలతో ఆయనపై దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయం తగలడంతో అమానుల్లా అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా... ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో నేరాలు అదుపుచేయడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమయ్యిందటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.