తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్పేహితురాలు, మాజీ ఏఐఏడీఎంకే నాయకురాలు శశికళ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు మరో ఊహించని షాక్ తగిలింది.

 శశికళకు చెందిన దాదాపుగా రూ.1,600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయపన్ను శాఖ(ఐటి) అధికారులు మంగళవారం తెలిపారు. 2016లో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె దాదాపు రూ.1,500 కోట్లతో చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూర్‌ ప్రాంతాల్లో తొమ్మిది ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆయా ప్రాంతాల్లోని ఆస్తులను అధికారులు సోమవారం జప్తు చేశారు. నగదు, ఒప్పందాల రూపంలో శశికళ ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఐటి ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించి ఐటి అధికారులు 2017లోనే శశికళ, అమె సన్నిహితులకు సంబంధించి ఇళ్లపై దాడులు జరిపి పలు కీలక పత్రాలకు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

 అనంతరం ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను గతంలోనే ప్రశ్నించారు. ఆస్తుల జప్తు విషయాన్ని శశికళకు తెలియజేసి నట్లు ఐటి శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఇప్పటికే బెంగళూరులోని అగ్రహారం జైలులో ఉన్నారు.