సాంకేతికతను ఉపయోగించి అధికార పార్టీలు ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి విజయాలు సాధిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఎక్కడ ఎన్నికలు జరిగిన ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అంశంపై చర్చ జరుగుతూనే ఉంటోంది. అయితే ఈ అనుమానాలను ఆసరాగా చేసుకుని ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఏకంగా ఎమ్మెల్యేను మోసం చేయాలని పథకం వేసి అడ్డంగా బుక్కయ్యాడు.ఈ సంఘటన ఇటీవల జరిగిన మధ్య ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగింది. 

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా బింద్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రమేశ్‌ దుబే పోటీ చేశారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయనకు ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఫోన్ చేశాడు. తాము ఎన్నికల్లో వాడే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంలో ఎక్స్‌పర్ట్ మని....ఎలా ట్యాంపర్ చేస్తామో కూడా వివరించాడు. ఈ ఎన్నికల్లో మీ కోసం ఆ పని చేయడానికి సిద్దంగా ఉన్నామని...అయితే అందుకోసం ఒక్కో ఈవీఎంకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

ఈ వ్యవహరంపై అనుమానం వచ్చిన రమేష్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పథకం ప్రకారం ఫోన్ చేసిన వ్యక్తిని గ్వాలియర్ వచ్చేలా చేశారు. అతన్ని పట్టుకుని విచారించగా, తన పేరు అభయ్ జోషి అని...ఈవీఎం ట్యాంపరింగ్ పేరుతో మోసం చేయడానికే ఇలా కాల్ చేసినట్లు వెల్లడించారు. అంతే కాని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే పరిజ్ఞానం తమ వద్ద లేదని తెలిపాడు. దీంతో ఈవీఎంల భద్రతపై నెలకొన్న అనుమానాలు మరోసారి తొలగిపోయాయి.