న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన తర్వాత కంగ్రాట్స్ ఇండియా అంటూ మోడీ ట్వీట్ చేశారు.

also read:గుడ్‌న్యూస్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

ఆదివారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.ఈ రెండు వ్యాక్సిన్లకు అనుమతి రావడం నిర్ణయాత్మక మలుపుగా ఆయన పేర్కొన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ , భారత్ బయోటెక్  ఈ టీకాలకు అనుమతి దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఆరోగ్యకరమైన , కోవిడ్ రహిత దేశానికి రహదారిని వేగవంతం చేసే దిశగా ఈ వ్యాక్సిన్లు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ఈ రెండు వ్యాక్సిన్లు కూడా దేశంలో  తయారైన విషయం తెలుసుకొని ప్రతి భారతీయుడు గర్వపడతాడన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను నెరవేర్చడానికి మన శాస్త్రీయ సమాజం యొక్క ఆత్రుతని ఇది చూపిస్తోందన్నారు.

అత్యుత్తమ పరిస్థితులకు వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసు సిబ్బంది, పారిశుద్య కార్మికులు, కరోనా యోధులందరికీ మోడీ ధన్యవాదాలు తెలిపారు. అనేక మంది ప్రాణాలను కాపాడిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.