Bandipore: తన గ్రామంలోని ప్రతి ఇంట్లో లైబ్రరీని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఒక కాశ్మీరీ యువకుడు ముందుకు సాగుతున్నాడు. అతనే సిరాజుద్దీన్ ఖాన్. ప్రస్తుతం హిస్టరీలో పీహెచ్ డీ చేస్తున్న సిరాజుద్దీన్ 'లైబ్రరీ విలేజ్ ' ఆలోచన ఇంగ్లండ్ నుంచి వచ్చిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయన ఈ ఆలోచనను అనుసరించడం ప్రారంభించినప్పుడు, కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని తాకిందని అన్నారు.


Library Village in Kashmir: ఇంగ్లాండ్, మహారాష్ట్రలో లైబ్రరీ విలేజ్ ఆలోచనతో స్ఫూర్తి పొందిన కాశ్మీరీ యువకుడు సిరాజుద్దీన్ ఖాన్ ఉత్తర కాశ్మీర్లోని బందిపోర జిల్లాలోని తన స్వగ్రామం ఆర్గామ్లో ఇప్పటికే 22 ఇళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు. ఈ గ్రామంలో సుమారు 500 మంది నివసిస్తున్నారు. సుమారు 100 గృహాలు ఉన్నాయి. ప్రస్తుతం హిస్టరీలో పీహెచ్ డీ చేస్తున్న సిరాజుద్దీన్ 'లైబ్రరీ విలేజ్ ' ఆలోచన ఇంగ్లండ్ నుంచి వచ్చిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయన ఈ ఆలోచనను అనుసరించడం ప్రారంభించినప్పుడు, కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని తాకిందని అన్నారు.

కాశ్మీరీ బాలబాలికల విద్యకు మద్దతు ఇవ్వడానికి సంజయ్ నహర్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ పూణేలోని సర్హాద్ ఫౌండేషన్ లో సిరాజుద్దీన్ ఖాన్ పెరిగాడు. ఇక్కడున్న వారిలో చాలా మంది ఉగ్రవాద బాధితులు ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ బుక్ ఫెయిర్ లో సర్హాద్ ఫౌండేషన్ స్టాల్ లో సిరాజుద్దీన్ మాట్లాడుతూ.. 'పుస్తకాలు మీ కళ్లను తెరిపిస్తాయి. మీరు ఎక్కడ ఉన్నారో.. మీరు ఏమి చేయగలరో అనేటువంటి జ్ఞానం మీకు అందిస్తుంది.. మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది' అని చెప్పినట్టు ఆవాజ్ ది వాయిస్ నివేదించింది.

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మహారాష్ట్రలోని బెల్లార్ అనే గ్రామంలో 'విలేజ్ లైబ్రరీ' తెరిచారని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని ప్రారంభించారు. సిరాజుద్దీన్ కూడా తన గ్రామంలో 'విలేజ్ లైబ్రరీ' ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. సిరాజుద్దీన్ స్వగ్రామంలో చేపట్టిన ప్రాజెక్టుకు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎన్ బీటీ), జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతు తెలిపాయి. ఫలితంగా గత రెండు నెలలుగా అరగంలో 100 ఇళ్లకు గాను 22కు పైగా ఇళ్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.

'హర్ ఘర్ లైబ్రరీ' వెనుక ఉన్న సిరాజుద్దీన్ ఆలోచన ఏమిటంటే, ప్రతి కుటుంబం ఒక నిర్దిష్ట అంశంపై పుస్తకాల సేకరణను కలిగి ఉండాలి.. తద్వారా ప్రజలు సమాచారం కోసం ఒకరినొకరు వారివారి ఇళ్లను సందర్శించవచ్చు. పుస్తకాలను ఇచ్చిపుచ్చుకోవచ్చు, ఆలోచనలను పంచుకోవచ్చు. ఒకరికొకరు ఇలా కలుసుకోవడం వల్ల సంబంధాలు సైతం మెరుగు పడతాయని చెప్పారు. హర్ ఘర్ లైబ్రరీ చర్యలు గ్రామస్తుల ఐక్యతను పెంచడమే కాకుండా, నియంత్రణ రేఖకు సమీపంలో నివసిస్తున్నందున వారి ఉమ్మడి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో వారిని ఏకం చేయడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.

పొరుగున ఉన్న కుప్వారాలోని హెల్మత్పొరా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ముబాషిర్ ముస్తాక్తో కలిసి సిరాజుద్దీన్ చేసిన ప్రచారం యువత ఆలోచనల్లో మార్పు తీసుకురావడంతో పాటు వారికి ఆలోచనకు పదును పెడుతూ, వారి భవిష్యత్తుపై దృష్టి సారించేలా చేసింది. అందరికీ ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదని, అందువల్ల స్వయం సహాయక చర్యలు అవసరమని సిరాజుద్దీన్ అంటున్నారు. ఇదే మంత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. సర్హాద్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవల ఆంగ్లం, కంప్యూటర్లు మొదలైన అంశాలపై ఇక్కడి వారికి బోధించారు. పూణేలోని ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలోజమ్మూ నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు చెందిన 25 మంది బాలికలు పాలుపంచుకున్నారు. ట్రైన్ ది ట్రైనర్ కార్యక్రమానికి హాజరైన ఈ అమ్మాయిలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇతరులకు సహాయం చేస్తారని తెలిపారు. 

తన గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక లైబ్రరీ ఉండాలనే తన ప్రచారాన్ని ముగించిన తరువాత, కాశ్మీర్ ను "జ్ఞాన లోయ"గా మార్చడానికి ఇతర గ్రామాలపై పనిచేయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రముఖులు సహా జాతీయోద్యమ ప్రముఖుల రంగురంగుల చిత్రాలను పాఠశాలలు, కళాశాలల గోడలపై అతికించి నిజమైన హీరోల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని యోచిస్తున్నారు. మరోవైపు, కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో ముబాషిర్ ముస్తాక్ హెల్మత్పోరాలో ప్రచారం ప్రారంభించారు. దానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ కు రావాల్సి రావడంతో ఇంట్లో లైబ్రరీ ఉండాల్సిన ఆవశ్యకతను గ్రహించాడు. పుస్తకాలను విరాళంగా ఇచ్చిన తన స్నేహితులు, బంధువుల సహాయంతో ముబాషిర్ గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. సుమారు 2000 పుస్తకాలను సేకరించి తన ఇంట్లో 14×10 మీటర్ల గదిలో లైబ్రరీని ప్రారంభించాడు. ఈ లైబ్రరీలో ఫిక్షన్ - సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, యూపీఎస్సీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధతకు సహాయపడే మ్యాగజైన్లు కూడా ఉన్నాయి. 

ముబాషిర్ మీడియాతో మాట్లాడుతూ, లైబ్రరీని తెరవడం గురించి తాను మొదట తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు అందరూ తనను చూసి నవ్వారని చెప్పారు. అయితే, నేడు కుటుంబ సభ్యులందరూ అతని భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. 'లెట్స్ టాక్ లైబ్రరీ'ని ఉపయోగించుకోవడానికి ఆయన ఇంట్లో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పుస్తక ప్రియుల సందడి ఉంటుంది.