బీజేపీ సీటు ఇచ్చినా.. తిరస్కరించిన అభ్యర్థి.. సారీ నేను పోటీ చేయలేనంటూ పోస్ట్..
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో ఓ అభ్యర్థి బీజేపీ ఇచ్చిన టికెట్ ను తిరస్కరించారు. తాను పోటీ చేయబోనని ఓ అభ్యర్థి ప్రకటించారు. బీజేపీ నాయకులకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చాలా మంది నాయకులు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అయితే పోటీ మరింత ఎక్కువగా ఉంది. కానీ పిలిచి మరీ బీజేపీ సీటు ఇచ్చినా.. దానిని తిరస్కరించాడు ఓ అభ్యర్థి. నేను పోటీ చేయలేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఎవరా నాయకుడు ? ఏమిటా కథ ?
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నుంచి పోటీ చేయబోనని భోజ్ పురి నటుడు, నేపథ్య గాయకుడు పవన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే తన నిర్ణయం వెనుక గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ‘ఎక్స్’ ఓ పోస్ట్ పెట్టారు. కొన్ని కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పారు.‘‘ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ నాపై నమ్మకం ఉంచి అసన్సోల్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను అసన్సోల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాను. ’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ స్థానానికి పవన్ సింగ్ ను ఎంపిక చేసింది. బీహార్ లోని అర్రాకు చెందిన పవన్ సింగ్ ను ఆయన అభిమానులు భోజ్ పురి చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ అని పిలుస్తారు.
తాను పోటీ చేయబోవడం లేదని పవన్ సింగ్ ప్రకటించగానే.. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు.బెంగాల్లో 'నారీ శక్తి' పిలుపు ఇప్పుడు బూటకమని, అది బూటకమని, అర్థరహితమని అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘బీజేపీ అసన్సోల్ అభ్యర్థి సెక్సిస్ట్ వీడియోలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పోటీలో నుంచి వైదొలిగారు. బెంగాల్ బీజేపీ ఇచ్చిన 'నారీ శక్తి' పిలుపు ఇప్పుడు బూటకమని తేలిపోయింది’’ అని విమర్శించారు.