కరోనా వేళ ఆక్సీజన్ అవసరం బాగా పెరిగిపోయింది. ఆక్సీజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఢిల్లీలో ఆక్సీజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. శనివారం 12 మంది ఆక్సీజన్ కొరతతో ప్రాణాలు కోల్పోగా.. గత వారం 25 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆక్సీజన్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు చాలా సార్లు కేంద్రాన్ని అడిగింది. తాజాగా.. ఈ విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి సూచనలు చేసింది.

ఈ రోజు( మే3) అర్థరాత్రి సమయానికి ఢిల్లీకి ఆక్సీజన్ సరఫరా చేయాలంటూ సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని, ఈ నిల్వల స్థానాలను వికేంద్రీకరించాలని ఉన్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశించింది.

దేశ రాజధానికి ఆక్సిజన్ సరఫరా విషయంలో ఢిల్లీ హైకోర్టులో కూడా జరిగిన వాదనలను కూడా సుప్రీం కోర్టు పరిశీలించింది. ఆక్సీజన్ సరఫరా చేయాలంటూ కేంద్రాన్ని హెచ్చరించింది.

ఢిల్లీకి ఆక్సీజన్ విషయంలో హైకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. "ఎదురు చూపులు చాలు. కేటాయించిన దానికంటే ఎక్కువ ఎవరూ అడగడం లేదు. మీరు ఈ రోజు కేటాయింపులను సరఫరా చేయలేకపోతే, మీ వివరణను సోమవారం చూస్తాము" అని హైకోర్టు ఇటీవల పేర్కొంది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రోజుకు సుమారు 970 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కోరింది. అయితే, కేంద్రం 590 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఈ విషయాన్ని వాదనల ద్వారా తెలుసుకున్న సుప్రీం కోర్టు...  కేంద్రానికి ఢిల్లీ పట్ల ప్రత్యేక బాధ్యత ఉందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడొద్దని సుప్రీం హెచ్చరించడం కొసమెరుపు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో సోమవారం 20,000 కొత్త కోవిడ్ కేసులు నమోదవ్వగా 400 మందికి పైగా మరణించారు. అత్యవసర ఆక్సీజన్ సరఫరా చేయడంతోపాటు.. రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన ఔషదాలు, టీకా విషయంలోనూ పున పరిశీలించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. టీకా ధర కూడా ఎక్కువగా ఉందని.. దానిని తగ్గించాలని సూచించింది.