ఉత్తరప్రదేశ్ లో బుధవారం జరిగిన ప్రమాదంలో పదేళ్ల బాలుడు చనిపోయాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కుమారుడు చనిపోడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనపై ఓ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై ఆగ్రహావేశాలు వెల్లగక్కారు.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తలకు కరెంట్ పోల్ దెబ్బతగలి పదేళ్ల తన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లితీవ్రంగా రోధించింది. తన కుమారుడి మృతికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమంటూ ఆతల్లి, ఇతర కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేశారు. ఆ పాఠశాల ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు చనిపోయి ఎంతో దుఃఖంలో ఉండి, నిరసన తెలుపుతున్న ఆమె దగ్గరికి ఓ మహిళా పోలీసు అధికారి వచ్చారు. నోరు మూసుకో.. ఆందోళన చెయొద్దు అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల వైపు వేలు చూపుతూ కోపంతో ఊగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లోని దయావతి మోడీ పబ్లిక్ స్కూల్ లో అనురాగ్ భరద్వాజ్ అనే పదేళ్ల పిల్లాడు 4వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. అయితే బస్సుల్లో కూర్చున్న తరువాత సరిగా ఊపిరాడకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బస్సు కదులుతున్న సమయంలోనే కిటికీలో నుంచి తల బయటకు పెట్టాడు. దీనిని డ్రైవర్ గమనించలేదు. ఓ మూల మలుపు వద్ద బస్సును డ్రైవర్ తిప్పాడు. అయితే రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్ అనురాగ్ తలకు తగిలింది. దీంతో తీవ్ర రక్తం జరిగింది. హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. అప్పటికే ఆ బాలుడు పరిస్థితి విషమించి చనిపోయాడు.
అయితే ఈ విషయంలో తీవ్రంగా కలత చెందిన తల్లిదండ్రులు ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బంధువులతో కలిసి ఆ స్కూల్ ఎదుట బైఠాయించారు. ఆ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మోడీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చి వారిని బెదిరించారు. రోదిస్తున్న తల్లిని ఉద్దేశించి ‘‘బాస్! చుప్ (చాలు! నోరు మూసుకో) అంటూ వేలు చూపుతూ గట్టిగా అరిచారు.
‘‘ మౌనంగా ఉండాలని నేను మీకు చెబుతున్నాను.. మీకు ఎందుకు అర్థం కావడం లేదు ? ’’ అంటూ అధికారి శుక్లా అనురాగ్ తల్లి నేహా భరద్వాజ్ ను ఉద్దేశించి కోపంతో చెప్పింది. దీంతో తల్లి ‘‘బాబు మీ కొడుకా.. మీ కొడుగా..’’ అంటూ రోదిస్తూ బదులిచ్చింది. ‘‘ ఎన్ని సార్లు ప్రయత్నించి మీకు అర్థం అయ్యేలా చెయ్యాలి’’ అని ఆ అధికారి మళ్ళీ గట్టి అరుస్తూ చెప్పింది. ‘‘ నేను సరిపోయేంతగా అర్థం చేసుకున్నాను. అందుకే నా కొడుకు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు ’’ అంటూ ఆ తల్లి తన కుమారుడిని తలచుకుంటూ బదులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
కాగా ఈ ప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై నివేదిక కావాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల, బస్సు సిబ్బంది, రవాణా శాఖపై చర్యలతో పాటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదిలా ఉండగా స్కూల్ యాజమాన్యం బస్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని అనురాగ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ బస్సులో చాలా మంది స్టూడెంట్లు ఉన్నప్పటికీ వారిని చూసుకునేందుకు ఒక్కరూ లేరని చెప్పారు. అనురాగ్ తల్లి డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 1వ తేదీ కూడా స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, డ్రైవర్‌తో తాము గొడవ పడ్డామని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
