అహ్మదాబాద్: ఓ వృద్ధురాలు ఆంగ్ల భాషలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దానికి ఫిదా అవుతున్నారు. అనర్గళంగా మహాత్మా గాంధీ గురించి మాట్లాడిన వృద్ధురాలి వీడియో అది. ఈ ముసలమ్మ కాంగ్రెసు నేత శశి థరూర్ కు గట్టి పోటీ ఇస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

శశి థరూర్ కు ఆంగ్ల భాషలో విశేషమైన ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. వృద్ధురాలి వీడియోని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వృద్ధురాలు భగ్వానీ దేవి ఎర్ర చీర కట్టుకుని మహాత్మా గాంధీ గురించి అనర్గళంగా మాట్లాడుతూ వీడియోలో కనిపించింది. 

 

భగ్వానీ దేవి రాజస్థాన్ లోని ఝుంఝున్ నివాసి అని చెబుతున్నారు. ప్రపంచంలోని మహా వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరని అని ఆమె వీడియోలో అన్నది. అతను మర్యాదస్తుల కుటుంబానికి చెందినవరు, ఆయన సాధారణ వ్యక్తి అని చెప్పింది. 36 సెకన్ల వీడియోలో గాంధీని జాతిపితగా కూడా ఆమె అభివర్ణించింది. తన పేరు చెబుతోూ గాంధీ అహింసా ప్రేమికుడని చెప్పింది.

ట్విట్టర్ లో వీడియో షేర్ చేస్తూ పది మార్కులకు ఆమెకు ఎన్ని మార్కులు ఇస్తారంటూ బోత్రా అడిగారు. ఆదివారంనాడు ఆయన వీడియోను షేర్ చేయగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఫిదా అయిపోయి కామెంట్స్ చేశారు. 

కాగా రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ పది మార్కులకు వంద మార్కులు ఇచ్చారు. ఆమెకు మార్కులు ఇవ్వడానికి తామెవరమూ అర్హులం కాదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. చివరకు శశిథరూర్ కు గట్టి పోటీ అంటూ పూర్ణచంద్రన్ నాయర్ వ్యాఖ్యానించారు.