హర్యానాలోని ఇద్దరు యువకులు ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ షాప్‌ను ఓపెన్ చేశారు. తమ 9 టు 5 జాబ్ వదిలిపెట్టి ఇద్దరు ఇంజినీర్లు బిర్యానీ షాప్ పెట్టుకున్నారు. ఇప్పుడు వారిద్దరి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు షాప్ రన్ చేస్తున్న వారిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నదని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చదువులకు కొలువులకు సంబంధం ఉండటం లేదు. ఏ మేనేజ్‌మెంట్ కోర్సో చదివి మరే రంగంలోనూ ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొందరు టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి సంబంధం లేని ఇతర రంగంలోకి వెళ్తున్నారు. ఉదాహరణకు ఇటీవలి కాలంలో బీటెక్‌లు చేసి బ్యాంకు ఉద్యోగాల్లో చేరినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇదేగాక, మరో తేడా కూడా కొలువులు చేస్తున్నవారిలో కనిపిస్తుంది. వృత్తి, ఒకటి ప్రవృత్తి మరోటి. ఈ రెండూ ఒకటే అయితే.. వారికి అసంతృప్తి చాలా వరకు ఉండదనే చెప్పొచ్చు. హర్యానాకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు తమ వృత్తి వదులుకుని ఇష్టం ఉన్న రంగంలోకి దూకేశారు. ఉదయం 9 గంటలకు ఆఫీసులకు వెళ్లి 5 గంటల వరకు జాబ్ చేసి మళ్లీ ఇల్లు చేరడం.. యంత్రాల్లా రోజూ ఇదే పని. ఇలా కూడదని అనుకున్నారు. వారికి ఇష్టమున్న ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. వారిద్దరూ కలిసి బిర్యానీ అమ్ముకుంటున్నారు. తాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు.
రోహిత్ సైనీ, విశాల్ భరద్వాజ్‌లు సోనిపాట్ దగ్గర రోజు 9 టు 5 జాబ్ చేశారు. రుచికరమైన బిర్యానీ వండి అమ్ముకోవాలనే లక్ష్యంతో ఉద్యోగానికి స్వస్తి పలికారు. దానికి ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ అని పేరు పెట్టారు. ఉత్తర ఢిల్లీలో వారు తమ షాప్ ఓపెన్ చేశారు. ఇంటర్నెట్‌లో వారి స్టోరీ వైరల్ అయింది. వారు ఆయిల్ లేకుండా కేవలం వెజెటేరియన్ బిర్యానీ మాత్రమే చేస్తున్నారని వెల్లడించారు.
రోహిత్ సైనీ మాట్లాడుతూ, తనకు వంట చేయడం, ఆహారంపై మక్కువ ఎక్కువ అని చెప్పారు. ఈ ఇష్టంతోనే ఎన్నో ఏళ్ల కింద యూట్యూబ్‌లో ప్రత్యేకంగా కుకింగ్ చానెల్ ప్రారంభించారని వివరించారు. ఇప్పటికీ ఆ చానెల్‌ను రన్ చేస్తున్నట్టు తెలిపారు. తనకు ఏ మాత్రం సమయం దొరికినా రెసీపీలు తయారు చేసి అందులో పోస్టు చేస్తుంటానని పేర్కొన్నారు. ఈ ఇష్టం ఉన్నప్పటికీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడని వివరించారు. అయితే, తనలాగే ఆలోచించే మరో వ్యక్తి తన ఆఫీసులో తారసపడ్డాడని, అప్పటి నుంచి ఇద్దరిలోనూ ఫుడ్ బిజినెస్ పెట్టాలనే ఆలోచన బలపడిందని తెలిపారు. తన కొలీగ్ విశాల్ భరద్వాజ్ తనతో తరుచూ ఈ విషయాన్ని చర్చించేవాడని చెప్పారు.

తాము ఇటీవలే షాప్ ఓపెన్ చేశామని, ఇంకా లాభాలు మొదలు కాలేదని వివరించారు. తమ ఖర్చు అదుపుదాటి పోకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికైతే.. లాస్ లేదు.. ప్రాఫిట్ లేదు అన్నట్టుగా ఉన్నదని వివరించారు. అయితే, వారు బిర్యానీ వంటకాన్నే ఎంచుకోవడానికీ కారణం చెప్పారు. ఇక్కడ బిర్యానీ తినాలంటే.. సోనిపాట్‌కు వెళ్లాల్సి ఉంటుందని, అక్కడా దాని ఖరీదు ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. కాబట్టి, తక్కువ ధరలో ఆ వెజ్ బిర్యానీని ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పారు. తాము అచారీ బిర్యానీ, గ్రేవీ చాప్ బిర్యానీలను వండి అమ్ముతున్నట్టు వివరించారు.
తమ స్టోరీ నుంచి పాజిటివ్ నోట్ మాత్రమే తీసుకోవాలని వారిద్దరూ ఔత్సాహికులకు సూచనలు చేశారు. తమలాగే.. ఉద్యోగాలు వదులుకుని షాప్ పెట్టుకోవాలని చెప్పడం లేదని, ఒక వేళ వారికి నిజంగా ప్యాషన్ ఉంటే, ఆర్థిక వెసులుబాటుతోపాటు కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
