కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఇంజనీరింగ్ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. యువతి మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఇంజనీరింగ్ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. యువతి మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఫిర్యదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు.. బాధిత విద్యార్థి ప్రీతి స్వస్థలం కోలారు జిల్లా శ్రీనివాసపురం సమీపంలోని యల్దూరు గ్రామం. ఆమె ప్రస్తుతం నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతుంది. ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రీతి.. కాలేజ్ లేడీస్ హాస్టల్‌లో ఉంటుంది.
అయితే ప్రీతి హాస్టల్ గదిలో ఫ్యానీ ఉరివేసుకుని కనిపించగా.. వెంటనే కళాశాల యాజమాన్యం సిబ్బంది ఆమెను చిక్కబళ్లాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రీతి మంగళవారం కాలేజ్‌కు వెళ్లలేదని.. హాస్టల్‌లోనే ఉండిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. తనకు అనారోగ్యంగా ఉందని తరగతులకు హాజరు కావడం లేదని .. హాస్టల్ వార్డెన్‌కి, స్నేహితులకు చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఆమె స్నేహితులు హాస్టల్‌కు తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రీతి మృతి మరణంపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ విజయపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ప్రీతి ఆత్మహత్య చేసుకుందా? ఇంకేమైనా జరిగిందా? అనేది పోలీసు విచారణ తర్వాత తేలనుంది.
