కాన్పూర్: తన భర్త ఎదురుకాల్పుల్లో చనిపోవడాన్ని గ్యాంగస్టర్ వికాస్ దూబే భార్య రిచా దూబే సమర్థించారు. తవ్వుకున్న గోతిలో వారే పడుతారని ఆమె వ్యాఖ్యానించారు. చేసిన పాపానికి బలై పోయాడని ఆమె అన్నారు. 

కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించినన వికాస్ దూబే అంత్యక్రియలకు ఆమె సోదరుడు, కుమారుడు హాజర్యయారు. ఇతర బంధువులు ఎవరూ హాజరు కాలేదు. వికాస్ దూబే ముఖం చూడడానికి కూడా తల్లి ఇష్టపడలేదు. తమ మాట ఏనాడూ వినలేదని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంత్యక్రియలకు తాను హాజరు కాబోనని ముందే చెప్పాడు. 

అంతకు ముందు కాన్పూర్ లాలా లజపతి రాయ్ ఆస్పత్రిలో వికాస్ దూబే మృతదేహానికి ముగ్గురు వైద్యుల బృందం పోస్టు మార్టం నిర్వహించింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారు. వికాస్ దూబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కాన్పూర్ ఆస్పత్రి సిబ్బంది వికాస్ దూబే మృతదేహాన్ని అతని బావమరిది దినేష్ తివారికి అప్పగించారు. 

ఉజ్జయిని నుంచి వికాస్ దూబేను ప్రత్యేక వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యమంలో ప్రమాదం జరిగింది. అడ్డం వచ్చిన పశువులను తప్పించడానికి ప్రయత్నించడంతో వికాస్ దూబే ఉన్న వాహనం బోల్తా పడిందని, ఆ సమయంలో వికాస్ దూబే పోలీసుల వద్ద ఉన్న 9ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోతూ కాల్పులు జరిపాడని, ఎదురు కాల్పుల్లో అతను హతమయ్యాడని వివరించారు.  

తనను అరెస్టు చేసిన వెంటనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పెద్దగా అరిచాడు. మై వికాస్ దూబ్ హూ, కాన్పూర్ వాలా (నేను వికాస్ దూబేను, కాన్పూర్ కు చెందినవాడిని) అని తనను అరెస్టు చేసిన వెంటనే పెద్దగా అరిచాడు. దాంతో పోలీసు అధికారి అతని తల వెనక బాది అరవకు అని హెచ్చరించాడు. 

అయితే, మహంకాళి ఆలయం వద్ద పథకం ప్రకారం అతను పోలీసులకు లొంగిపోవడానికి ఏర్పాటు చేసుకున్నట్లున్నాడని యూపి డీజీపీ అరవింద్ కుమార్ అన్నారు. తనను తాను మహంకాళి సెక్యూరిటీ గార్డుకు పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడని ఆయన చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గ్రహించడంతో, తన అనుచరులు ముగ్గురు పోలీసులు కాల్పుల్లో హతం కావడంతో భయపడి వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులతో, రాజకీయ నేతలతో వికాస్ దూబేకు పరిచయాలున్నాయి. 

వికాస్ దూబే అరెస్టును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధ్రువీకరించారు. కాన్పూర్ ఎన్ కౌంటర్ తర్వాత తమ పోలీసులు అప్రమత్తయ్యారని, వికాస్ దూబేను పట్టుకోవడానికి అది సాయపడిందని ఆయన అన్నారు. ఇద్దరు వికాస్ దూబే అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం వద్ద ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతను పోలీసులకు చిక్కాడు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వికాస్ దూబే పూజలు చేయడానికి వచ్చాడు. మహంకాళి ఆలయం వద్ద సెక్యూరిటీ గార్డు వికాస్ దూబేను పట్టుకున్నాడు. ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డు ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ కు చెప్పాడు. దాంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్న విషయాన్ని మధ్యప్రదేశ్ డీజీపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. 

వికాస్ దూబేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ముగ్గురు హతమయ్యారు. గురువారం ఉదయం ఇద్దరు హతం కాగా, అంతకు ముందు ఒకతను మరణించాడు.