జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు గురువారం ఉదయం ప్రకటించారు.

శ్రీనగర్ : ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ గ్రామంలో రాత్రిపూట కాల్పులు జరిగాయి. ఇందులో అల్-బదర్‌కు చెందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసు అధికారులు గురువారం తెలిపారు.

హతమైన ఉగ్రవాదులు ఇద్దరూ స్థానికులేనని, వారిని ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌గా గుర్తించామని కాశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీస్, విజయ్ కుమార్ చెప్పారు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ‘‘ చనిపోయిన ఇద్ద‌రు అల్-బాదర్ సంస్థకు చెందినవారు. 2022 మార్చి-ఏప్రిల్ నెలలో పుల్వామాలో వలస కూలీల హత్యలు, దాడులలో వారిద్దరూ పాల్గొన్నారు’’ అని ఐజీపీ చెప్పారు. 

గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి ఉంద‌ని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందించడంతో బుధ‌వారం సాయంత్రం ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇందులో స్థానిక పోలీసులు, CRPF, ఇండియ‌న్ ఆర్మీ సంయుక్త శోధన బృందాలు పాల్గొన్నాయి. కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అంతకు ముందు ఇదే విష‌యంలో ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సంయుక్త బలగాల బృందం అనుమానిత స్థలాన్ని చుట్టుముట్టాయి. అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు ఈ బృందాల‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో బ‌ల‌గాలు కూడా కాల్పులు జరిపాయి. ఇది ఎన్ కౌంట‌ర్ కు దారి తీసింది. అయితే పౌరుల తరలింపు కోసం కొంతసేపు ఆపరేషన్‌ను నిలిపివేశాం ’’ అని అధికారులు తెలిపారు. 

Scroll to load tweet…

అయితే ఈ ఎన్ కౌంట‌ర్ లో సంయుక్త బృందంలో ఉన్న స‌భ్యుల‌కు కూడా గాయాలు అయ్యాయి. మొద‌ట కొంత సేపు జ‌రిగిన కాల్పుల్లో ఒక సైనికుడికి గాయాలు అయ్యాయి. ఆయ‌న‌ను శ్రీనగర్‌లోని 92 బేస్ ఆర్మీ ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆ సైనికుడు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. కొంత స‌మ‌యం త‌రువాత ఆపరేషన్ తిరిగి ప్రారంభం కాగానే సాయంత్రం ఓ ఉగ్రవాది హతమయ్యాడు, ఆ తర్వాత మళ్లీ రాత్రి సమయంలో ఆపరేషన్‌ను నిలిపివేశారు. గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ స‌మ‌యంలో మరో ఉగ్రవాది హతమయ్యాడని ఐజీపీ విజ‌య్ కుమార్ చెప్పారు. ఇది 41వ ఎన్‌కౌంటర్ అని, ఇప్పటి వరకు పది మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులతో పాటు మొత్తంగా 61 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని తెలిపారు. 

Scroll to load tweet…