జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఓ సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ, తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయని చెప్పారు.
శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ జిల్లాలోని జలాలాబాద్ సుంజ్వాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. అయితే CISF కు చెందిన ఒక ASI కూడా వీర మరణం పొందారు. తొమ్మిది మంది భద్రతా బలగాలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్లు ఉన్నారు.
దాదాపు 15 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది బస్సులో ఉదయం షిఫ్ట్ విధులకు వెళుతుండగా.. ఆ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేశారు. అయితే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రతిఘటించడంతో ఉగ్రవాదులు పారిపోయారు. ఇందులో ఇద్దరు జైషే మహ్మద్ (జేఈఎం) సంస్థకు చెందిన ఉగ్రవాదలు హతం అయ్యారు.
ఈ కాల్పుల్లో ఓ ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు. ‘‘ ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు, 2 AK-47 రైఫిల్స్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, శాటిలైట్ ఫోన్లు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. వారు ‘ఫిదాయీన్’ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ జరుగుతోంది.’’ అని ఆయన చెప్పారు.
ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్న ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ‘‘ ఇది జమ్మూలో శాంతికి భంగం కలిగించడానికి మరియు ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి పర్యటనను విధ్వంసం చేయడానికి పెద్ద కుట్రలో భాగం ’’ అని ఆయన తెలిపారు.
సాంబా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్ల మధ్య సుంజ్వాన్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 24) జమ్మూ కాశ్మీర్‌లోని పల్లి నుండి దేశంలోని పంచాయితీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
