ఇటీవల శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ లోని బిషంబర్ నగర్-దాల్గేట్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్ లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి వారిని హతమార్చారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం ఉద‌యం ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు. అయితే ఇందులో మృతి చెందిన ఇద్దరు ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందిపై ఇటీవల దాడికి పాల్ప‌డ్డ వారిలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. 

చాలా ర‌ద్దీగా ఉండే శ్రీన‌గ‌ర్ ప్రాంతంలో నేటి ఉద‌యం ఈ కాల్పులు జ‌రిగాయి. ఇందులో మొద‌ట జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, రెండు గంటల తర్వాత జ‌రిగిన మ‌రో ఎన్ కౌంట‌ర్ లో ఇంకో ఉగ్ర‌వాది చ‌నిపోయారు. అయితే వీరి పూర్తి వివ‌రాలు ఇంకా పోలీసులు గుర్తించ‌లేక‌పోయారు. అయితే వారు పాకిస్తాన్‌కు చెందినవారని చెప్పారు. “సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఇద్ద‌రు పాకిస్తానీ ఉగ్రవాదులు శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో చ‌నిపోయారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర నేరారోపణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం” అని జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. 

ఆదివారం ఉదయం శ్రీనగర్‌లోని బిషంబర్ నగర్-దాల్గేట్ పరిసర ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ల సంయుక్త బృందం చుట్టుముట్టింది. ఈ సంయుక్త బృందం ఇంట్లోకి చొరబడుతుండగా లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జ‌రిపారు. ఈ భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. 

అయితే గ‌త మంగళవారం సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న శ్రీనగర్‌లోని మైసుమా పరిసరాల్లో జ‌రిగింద‌ని పేర్కొన్నారు. అయితే ఇందులో మిలిటెంట్లు పాయింట్-బ్లాంక్ రేంజ్ నుండి కాల్పులు జ‌ర‌ప‌డంతో ఒక CRPF సైనికుడు మరణించాడ‌ని తెలిపారు. మ‌రొక సిబ్బందికి గాయాలయ్యాయని చెప్పారు 

ఇదిలా ఉండ‌గా దక్షిణ కాశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారం రావ‌డంతో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో శ‌నివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్ర‌మంలో ఒక ఉగ్ర‌వాది చ‌నిపోయారు. అలాగే బుధవారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను అన్సార్ ఘజ్వతుల్ హింద్‌కు చెందిన సఫత్ ముజఫర్ సోఫీ, లష్కరే తాయిబాకు చెందిన ఉమర్ తేలీగా గుర్తించారు. 

మార్చి 31వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని తుర్క్‌వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఓ గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాది హ‌తమ‌య్యాడు. దీనిని జ‌మ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు నిర్దారించారు. ఫిబ్రవరి 19వ తేదీన షోపియాన్ లోని జైనాపోరా ప్రాంతంలోని చెర్‌మార్గ్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా వీర మ‌ర‌ణం పొందారు.