జమ్మూ కాశ్మీర్ లో శనివారం ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన శనివారం సాయంత్రం హాస్పిటల్ లో చనిపోయారు. దీంతో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆదివారం ఉదయం చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరుగుతోంది. 

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభ‌మైంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. ఈ మేర‌కు వారు నేటి ఉద‌యం ట్వీట్ చేశారు 

‘‘ కుల్గామ్‌లోని చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, సైన్యం ఆ పనిలో ఉంది. మరిన్ని వివరాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం ’’ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా శనివారం ఉదయం ఉగ్రవాదులు ఒక పోలీసుపై దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. ఆయ‌న పోలీస్ కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ 112లో డ్రైవర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న అనంత‌రం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ఉగ్రవాదుల ఆచూకీ లభించలేదు. 

Scroll to load tweet…

ఇది శనివారం ఉదయం 8.50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ గులాం హసన్‌ను సఫాకదల్ ప్రాంతంలోని ఐవా వంతెన సమీపంలో ఉగ్రవాదులు కాల్చిచంపార‌ని చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే ఆయ‌న బైక్‌పై నుంచి కిందపడ్డాడ‌ని చెప్పారు. అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. గులాం హ‌స‌న్ కు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో సిబ్బంది వెంటనే షేర్-ఎ-కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)కి తరలించారు. అయితే ఆయ‌న అక్క‌డ‌ చికిత్స పొందుతూ సాయంత్రం చ‌నిపోయారు అని పోలీసులు చెప్పారు. 

ఈ స‌మాచారం అందుకున్న వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతమంతా భద్రతా వలయాన్ని పటిష్టం చేశారు. ప్ర‌స్తుతం ఎన్ కౌంట‌ర్ జ‌రుగుతోంది. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.