జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఎవరన్నది గుర్తించాల్సి ఉందనీ... వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

జిల్లాలోని టికెన్ గ్రామం వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి నిన్న భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులతో కలిసి సైనిక  బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టాయి. గాలింపు సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. కాగా శుక్రవారం ట్రాల్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో జైషేమహ్మద్‌కి చెందిన ఓ ఉగ్రవాది హతమైన సంగతి తెలిసిందే. ఈ ఘటలో ఓ పోలీసుకు కూడా గాయాలయ్యారు.