న్యూఢిల్లీ:  మెదడువాపు వ్యాధి బారిన పడి 120 మంది చిన్నారులు మృతి చెందడంపై సుప్రీంకోర్టు బీహార్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి  సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.

బిఆర్ గవాయి, సంజీవ్ కృష్ణ‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్  సోమవారం నాడు ఈ రెండు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో మెడికల్ సౌకర్యాలు, శానిటేషన్, న్యూట్రిషన్ తదితర విషయాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బెంచ్ బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

న్యాయవాదులు మనోహార్ ప్రతాప్, సంప్రీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం నాడు ఈ ఆదేశాలు జారీ చేసింది. మెదడువాపు వ్యాధి వ్యాప్తి చెందిన నేపథ్యంలో మెడికల్ బృందంతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.

అయితే  రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని  బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయమై విచారణను పది రోజులకు వాయిదా వేసింది కోర్టు.

ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు సుమారు  140 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముజఫర్ నగర్ జిల్లాలోనే ఎక్కువగా చిన్నారులు మృతి చెందారు. రాష్ట్రంలోని 40 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం  ఉందని వైద్యాధికారులు ప్రకటించారు.