ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో ఎంతో కొంత నిష్పక్షపాత ధోరణులు కనిపిస్తుంటాయి. ఎలాంటి విమర్శలనైనా అంటే దాని నిబంధనలకు విరుద్ధం కానంతవరకు అది స్వీకరిస్తున్నది. కానీ, భావప్రకటన స్వేచ్ఛను కోరుకుంటానని తరుచూ చెప్పే ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇకపైనా ఆయన చెబుతున్నట్టుగా విమర్శలను ఆయన స్వీకరించి అందరికీ ట్విట్టర్‌లో స్పేస్ ఇస్తాడా? అంటే అందుకు ఆయన ఉద్యోగులు విరుద్ధమైన సమాధానం చెబుతున్నారు.

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ పలుమార్లు తాను ఫ్రీ స్పీచ్ బలంగా కోరుకునే వ్యక్తి అని వ్యాఖ్యలు చేశాడు. తనను తాను ఫ్రీ స్పీచ్ అబ్జల్యూటిస్ట్ అని పేర్కొంటుంటాడు. అంతేకాదు, ట్విట్టర్ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత ఓ వ్యాఖ్య చేశాడు. ప్రజాస్వామ్య మనుగడకు భావ ప్రకటన స్వేచ్ఛ సిసలైన పునాది అని పేర్కొన్నాడు. గతంలోనూ ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థిస్తూ చాలా సార్లు ట్వీట్లు చేశాడు. కానీ, నిజంగా ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను కోరుకుంటాడా? ఆయన వ్యాఖ్యల్లో నిజమెంత? అనే అనుమానాలు బయల్దేరుతున్నాయి. ఎందుకంటే.. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీలో పని చేసిన ఉద్యోగులు కొందరు ఇందుకు విరుద్ధమై విషయాలు చెబుతున్నారు.

తాను భావ ప్రకటన స్వేచ్ఛను గొప్పగా ఆదరిస్తానని, తనను అత్యంత కఠినంగా విమ ర్శించేవారైనా సరే ఈ వేదిక(ట్విట్టర్) పై ఉండాలని కోరుకుంటానని ఎలన్ మస్క్ పేర్కొన్నాడు. నిజంగా ఎలన్ మస్క్ కరుకైన విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుంటాడా? విమర్శలను పెద్దగా ఖాతరు చేయడా? అంటే అదంతా నిజం కాదేమోనని తెలుస్తున్నది. ముఖ్యంగా విమర్శల విషయంలో తాను ఎదుటి వారి అభిప్రాయాలను సానుకూలంగా తీసుకుంటాడనే మాటను ఆయన నిలబెట్టుకోకపోవచ్చని ఆయన ఉద్యోగులు చెబుతున్నారు. ఆయన విమర్శలను టఫ్‌గా డీల్ చేస్తాడనే అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఎలన్ మస్క్ చెబుతున్న ఫ్రీ స్పీచ్ గురించి టెస్లా కంపెనీ ఉద్యోగుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎలన్ మస్క్ తన ఉద్యోగుల భావ ప్రకటన స్వేచ్ఛ లేదా విమర్శలను ఉపేక్షించబోడని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అందుకే టెస్లా కంపెనీలో ఓ అగ్రిమెంట్ ఉంటుందని, దానికి కాల పరిమితి కూడా లేదని వివరించారు.

కంపెనీ గురించి, దాని సేవల గురించి ఉద్యోగులు ఏ విధంగానైనా నెగెటివ్‌గా మాట్లాడరాదని, చెప్పరాదని, అభిప్రాయాలు వెలిబుచ్చరాదని ఆ ఒప్పందం చెబుతున్నది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొంటుంది. దీన్నే ట్విట్టర్‌కు అన్వయిస్తే.. టెస్లా ఉద్యోగులు ఆ కంపెనీ తప్పొప్పుల గురించి, దాని తప్పిదాల గురించి ట్విట్టర్‌లో ప్రస్తావించరాదు. లేదా కంపెనీలో అంతర్గతంగా సాగే తప్పిదాల గురించీ పాత్రికేయులకూ అభిప్రాయాలు, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయరాదు.

ఓ టెస్టా మాజీ ఎంప్లాయీ ఈ ఒప్పందంపై సంతకం పెట్టడానికి నిరాకరించాడు. దీంతో ఆయనను కంపెనీ నుంచి తొలగించారు. ఆయన ఆ ఒప్పందం కాపీని సీఎన్‌బీసీ చానెల్‌తో పంచుకున్నాడు. కంపెనీ గురించి, కంపెనీ ఉత్పత్తులు, అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, షేర్ హోల్డర్లు, సబ్సిడరీలు, అఫిలియేట్లు, కంపెనీతో ముడిపడి ఉన్న ఇతర బిజినెస్‌మెన్ల వ్యాపార లేదా వ్యక్తిగత రిప్యూటేషన్‌ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయరాదని ఆ ఒప్పందం చెబుతున్నది. ఆ ఒప్పందం గురించీ బయట చెప్పరాదని అదే డీల్ చెబుతున్నది.

టెస్లా కంపెనీ ఉద్యోగులను వైర్ ట్యాపింగ్ విధానం లేదా స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి వారిపై గూఢచర్యం చేస్తున్నదని బయటకు చెప్పిన టెస్లా ఉద్యోగి కార్ల్ హాన్సెన్‌ను 2018లో ఉద్యోగం నుంచి తొలగించారు.

అంతేకాదు, ఎలన్ మస్క్ ప్రెస్‌ను కూడా కంట్రోల్ చేయాలని ప్రయత్నించినట్టు తెలిసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నేషనల్ సెక్యూరిటీ ఎడిటర్ షెరాన్ వెయిన్‌బర్గర్‌ను స్పేస్ ఎక్స్ ఫెసిలిటీ చూడటానికి ఎలన్ మస్క్ ఆహ్వానించాడు. ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత తమ పత్రికలో టెస్లా గురించిన వ్యాసాలు ప్రచురించడానికి ముందు తనను రివ్యూ చేయనివ్వాలని కోరినట్టు షెరాన్ ట్వీట్ చేశాడు. కానీ, జర్నలిజం ఆ విధంగా సాగదని స్పష్టం చేశానని వివరించాడు. దానికి సమాధానంగా తాను కాదు.. మీ టీమ్‌ వాటిని రివ్యూ చేయాలని చెప్పినట్టు మాట మార్చాడని వివరించాడు. అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన తాజా ట్వీట్లు తనను ఆశ్చర్యపరచడం లేదని పేర్కొన్నాడు.