'ఎక్స్' యూజర్లకు మస్క్ మామ షాక్ ... ఇకపై పోస్ట్ , రిప్లై చివరకు లైక్ చేయాలన్నా ఛార్జీలే...
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ 'ఎక్స్' యూజర్లపై భారం మోపాడు. ఇకపై ఎక్స్ ను ఉపయోగించాలంటే ఛార్జీలు చెల్లించాల్సి వుంటుంది.
ట్విట్టర్ ఎప్పుడైతే ఎలాన్ మస్క్ చేతిలో పడిందో అప్పుడే ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ట్విట్టర్ ను కాస్త 'ఎక్స్' గా మార్చిన మస్క్ ఇప్పుడు దాన్ని కమర్షియల్ చేసే ప్రయత్నాల్లో వున్నారు. ఇంతకాలం ఎక్స్ మాధ్యమంలో ఏదయినా పోస్ట్ పెట్టాలన్నా, మరేదైన పోస్ట్ కు రిప్లై ఇవ్వాలన్నా ఉచితమే. కానీ ఇప్పుడు ఎక్స్ లో ఏం చేయాలన్నా ఛార్జీలు చెల్లించాల్సిందే... పోస్ట్, రిప్లైలకే కాదు చివరకు లైక్ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. ఈ దిశగా ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే తాజా నిర్ణయం వెనక యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలనేదే లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఇకపై ఎక్స్ వినియోగించేవారు ఛార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. ఎక్స్ ను ఫాలో అవడానికి, బ్రౌజ్ చేయడానికి మాత్రం ఎలాంటి చార్జీలు వుండవని తెలిపారు.
కొత్తగా 'ఎక్స్' అకౌంట్ ఉపయోగిస్తున్న వారు పోస్ట్, రిప్లై, లైక్స్ చేయాలనుకుంటే సంవత్సరానికి కొంత డబ్బు చెల్లించాల్సి వుంటుందన్నారు. ఎక్స్ యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయతే చార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడమే కాదు కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎక్స్ మాధ్యమంలో సమూల మార్పులకోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే యూజర్లపై ఛార్జీల భారం వేసారు. అయితే ఈ చార్జీల పెంపుపై యూజర్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి.