వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని 108 మునిసిపాలిటీలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేర‌కు  గురువారం  నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని 108 మునిసిపాలిటీలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం (WBSEC) ప్రకటించింది. ఈ మేర‌కు గురువారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మార్చి 8 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారి తెలిపారు. అయితే ఫలితాల తేదీ ఎప్పుడ‌నేది WBSEC ఇంకా ప్రకటించలేదు.

108 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు తేదీని త‌ర్వ‌లోనే నిర్ణ‌యిస్తామ‌ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సౌరవ్ దాస్ గురువారం ఓ మీడియా సంస్థ‌కు వెళ్ల‌డించారు. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు, పోలీసు సూపరింటెండెంట్‌లను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. 

మున్సిపల్ ఎన్నికల తేదీలపై చర్చించేందుకు ఎన్నికల సంఘం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా ఎన్నికలను మ‌రి కొంత కాలం పాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని అధికార తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల తేదీపై మాత్రం ప‌లు పార్టీలు స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. మున్సిపాలిటీలకు ఎన్నిక‌లు జ‌రిగిన రోజునే ఫ‌లితాల లెక్కింపును తప్పనిసరిగా చేపట్టాలని బీజేపీ, వామపక్షాలు డిమాండ్ చేశాయి. 

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌శ్చిమ బెంగాల్ లోని సిలిగురి, బిధాన్‌నగర్, చందన్‌నగర్, అసన్సోల్ మున్సిపాలిటీలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు జనవరి 22వ తేదీనే జరగాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా.. కోవిడ్ -19 కేసుల దృష్ట్యా ఎన్నికల సంఘం మున్సిపాలిటీ ఎన్నిక‌ల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాజకీయ ర్యాలీలో 200 మందికి మించి ప్ర‌జ‌లు పాల్గొన‌కూడ‌దు. ఇంటింటికీ ప్రచారం కోసం అభ్యర్థి, ఆ అభ్య‌ర్థి సెక్యూరిటీ సిబ్బంది కాకుండా మ‌రో ఐదుగురికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. ప్రచారం సంద‌ర్భంగా ఇంటింటికీ వెళ్లే స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని సూచించింది.