జీవితంపై ఆశలన్నీ ఆవిరయ్యాయి.. ఈ జైలులోనే చస్తే బాగుండు: కోర్టులో జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
జీవితంపై ఆశలన్నీ ఆవిరై పోయాయి. నన్ను హాస్పిటల్ తీసుకెళ్లడానికి బదులు ఇదే జైలులో చనిపోవడానికి అనుమతించండి. ఈ స్థితిలో జీవించడానికంటే చావడమే మేలు అని జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ పేర్కొన్నాడు.
Naresh Goyal: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ప్రత్యేక కోర్టు ముందు వినతులు చేశాడు. వణుకుతున్న చేతులు జోడించి.. ‘నాకు జీవితంపై అన్ని ఆశలు పోయాయి.. ఈ స్థితిలో జీవించడం కన్నా జైలులోనే మరణిస్తే బాగుండు’ అని పేర్కొన్నాడు. తన భార్య అనితను తీవ్రంగా మిస్ అవుతున్నట్టు వివరించాడు. ఆమె క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజీలో ఉన్నదని తెలిపాడు. వారికి ఉన్న ఒక్కగానొక్క కూతురు కూడా అనారోగ్యంతోనే ఉన్నదని శనివారం కోర్టుకు చెప్పాడు.
కెనరా బ్యాంకులో రూ. 538 కోట్ల ఫ్రాడ్ కేసులో నరేష్ గోయల్ నిందితుడిగా ఉన్నాడు. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో నరేష్ గోయల్ ఉన్నాడు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే ముందుకు గోయల్ తన బెయిల్ దరఖాస్తు చేసుకున్నాడు.
శనివారం ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కొన్ని నిమిషాలు వ్యక్తిగత వివరాలు పంచుకోవడానికి అనుమతించాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. కోర్టు నమోదు చేసుకునే రోజ్ నామా రికార్డుల ప్రకారం, గోయల్ చేతులు జోడించి వణుకుతున్న వళ్లుతో తన ఆరోగ్యం దారుణంగా ఉన్నదని, తీవ్రమైన బాధ ఉన్నదని వివరించాడు. తన భార్య మంచం పట్టిందని, ఒక్కగానొక్క కూతురు కూడా అనారోగ్యంగా ఉన్నట్టు చెప్పాడు.
Also Read: Sankranthi Holidays: సంక్రాంతి సెలవుల వివరాలివే.. ఇంటర్ కాలేజీలకు నాలుగు రోజులు, స్కూళ్లకు..
గోయల్ తన విజ్ఞప్తులు చెబుతున్నప్పుడు ఓపికగా విన్నట్టు జడ్జీ నోట్ చేసుకున్నాడు. గోయల్ బాడీ మొత్తం కంపిస్తున్నట్టు గుర్తించామని, ఆయనకు వెంటనే సహాయం అవసరం అని జడ్జీ నోట్ చేసుకున్నారు.
గోయల్ తన మోకాళ్లు చూపిస్తూ.. ఇవి వాచిపోయాయని, తన కాళ్లు ముడుచుకోరావడం లేదని గోయల్ వివరించాడు. తన మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పికి గురైనట్టు తెలిపాడు. ఒక్కోసారి మూత్రంతోపాటు నెత్తురు కూడా పడుతున్నదని చెప్పుకున్నాడు. చాలా సార్లు తనకు అసిస్టెన్స్ అందనే అందదని తెలిపాడు.
తాను చాలా బలహీనంగా ఉన్నానని, తనను జేజే హాస్పిటల్ చూపించడంలో అర్థం లేదని గోయల్ వాదించాడు. తోటి ఖైదీలతో క్యూలో వెళ్లడం, చాలా ఇబ్బందిగా ఉంటుందని వివరించాడు. వైద్యుల ముందు కూడా చాలా పెద్ద క్యూ ఉంటుందని, ఒక్కసారి అక్కడ వైద్యుడు పరీక్షించిన తర్వాత మళ్లీ ఆయనను కలిసే అవకాశాలు లేవని పేర్కొన్నాడు. ఫాలో అప్ అనేది లేకుండా పోయిందని ఆరోపించాడు.
తనను జేజే హాస్పిటల్ తీసుకెళ్లడానికి బదులు జైలులోనే మరణించడానికి అనుమతించాలని గోయల్ కోరాడు. తనకు 75వ పడిలో పడతారని, తనకు జీవితంపై ఆశలేమీ లేవని అన్నాడు .ఈ పరిస్థితుల్లో జీవించడం కన్నా మరణించడం ఉత్తమం అని వివరించాడు. తన ఆరోగ్యం సహకరించకున్నా తన బాధలు ప్రత్యక్షంగా చెప్పుకోవాలనే కాంక్షతో కోర్టు ముందుకు వచ్చినట్టు చెప్పాడు. కానీ, ఇక మరెప్పుడూ ఈ కోరిక కోరనని వివరించాడు.
Also Read : Rythu Bandhu : 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు, మళ్లీ మంత్రి సమీక్ష ఎప్పుడంటే ?
గోయల్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆయనను అలా నిస్సహయాంగా వదిలిపెట్టరాదని కోర్టు పేర్కొన్నది. ఆయనకు అవసరమైన శారీరక, మానసిక వైద్యాన్ని అందించాలని జడ్జీ వివరించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని లాయర్లనూ ఆదేశించింది.