UP election result 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టిస్తూ.. మళ్లీ అధికారం చేపట్టబోతున్నది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ కొన్ని సీట్లు కోల్పోయింది. మరీ ముఖ్యంగా 'సీఎం యోగి ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.
UP election result 2022: ఇటీవల ఏడు దశల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 403 స్థానాలకు బీజేపీ 273 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని సీట్లను బీజేపీ కోల్పోయింది. 59 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోలేక పోయింది. భారీ ఆశాలు పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ అంచనాలను అందుకోలేదు. కేవలం 125 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు దారుణంగా విఫలమయ్యాయి. కాంగ్రెస్ 2, బీఎస్పీ 1 స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతరులు రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ గత ఎన్నికల్లో కంటే తక్కువ స్థానాలు గెలుచుకుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర క్యాబినెట్ లోని చాలా మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయా మంత్రుల పనితీరు మెరుగ్గా లేని కారణంగానే ప్రజలు ఈ విధమైన తీర్పును ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
యోగి ప్రభుత్వంలోని ఓడిన మంత్రులు వీరే.. !
1. కేశవ్ ప్రసాద్ మౌర్య (deputy chief minister)
2. సురేశ్ రాణా (Sugarcane minister Suresh Rana)
3. రెవెన్యూ మంత్రి ఛత్రపాల్ సింగ్ గంగ్వార్
4. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్
5. ప్రజాపనుల శాఖ సహాయ మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ
6. ఆనంద్ స్వరూప్ శుక్లా
7. క్రీడా మంత్రి ఉపేంద్ర తివారీ
8. MoS రణవీర్ సింగ్ దున్ని
9. లఖన్ సింగ్ రాజ్‌పుత్
10. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేది.
ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. యూపీ ఉప ముఖ్యమంత్రి, సిరతు నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన పల్లవి పటేల్ చేతిలో 7,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పటేల్ సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షమైన అప్నా దళ్ (కె) ఉపాధ్యక్షుడు. మంత్రి సురేశ్ రాణా షామ్లీ జిల్లాలోని థానా భవన్‌లో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి అష్రఫ్ అలీ ఖాన్ చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో మంత్రి ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ బరేలీ జిల్లాలోని బహేరీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అతౌర్ రెహ్మాన్ చేతిలో 3,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్ ప్రతాప్‌గఢ్‌లోని పట్టి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ సింగ్ చేతిలో 22,051 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మరో మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ్ చిత్రకూట్‌లో ఎస్పీకి చెందిన అనిల్ కుమార్ చేతిలో 20,876 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బల్లియా జిల్లాలోని బరియా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జైప్రకాష్ ఆంచల్ చేతిలో ఆనంద్ స్వరూప్ శుక్లా 12,951 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శుక్లా చివరిసారిగా బల్లియా స్థానం నుంచి పోటీ చేశారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్థానంలో బరియా స్థానం నుంచి ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్ర క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ బల్లియాలోని ఫెఫ్నా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంగ్రామ్ సింగ్ చేతిలో 19,354 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉషా మౌర్యపై మంత్రి రణవీర్ సింగ్ ధున్నీ 25,181 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
