Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం 21 నుంచి ఎన్నికలు.. ఈ సారి రాహుల్ గాంధీకి సమ్మతమేనా?

కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు ఈ నెల 21వ తేదీ నుంచి జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పార్టీ పోస్టులకు ఎన్నికలు జరుగనున్నాయని వివరించాయి. అయితే, ఈ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఇంకా పెదవి విప్పలేదని పేర్కొన్నాయి. దీంతో ఆయన పార్టీ పగ్గాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడా? అనే విషయం ఇంకా అస్పష్టంగానే ఉన్నది.
 

election for select congress president start from august 21 says party sources
Author
New Delhi, First Published Aug 10, 2022, 4:19 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక అనే అంశం కొన్ని సంవత్సరాలుగా నానుతూనే ఉన్నది. కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. తరుచూ సీడబ్ల్యూసీలో ఈ అంశంపై చర్చించడం,  ఎన్నిక నిర్వహణను మరికొన్ని నెలలు వాయిదా వేయడం తంతుగా వస్తున్నది. తాజాగా, ఈ నెల 21వ తేదీ నుంచి కాంగ్రెస్ చీఫ్ ఎంపిక కోసం ఎన్నికలు జరుతాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ సారైనా రాహుల్ గాంధీ సరేనంటారా? అనే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులు సహా సామాన్యులనూ తొలుస్తున్న ప్రశ్న.

అయితే, ఈ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఇంకా మౌనం వీడలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చీఫ్‌గా గాంధీయేతర వ్యక్తిని నియమించాలనే అంశంపైనా ఈ పార్టీ చాన్నాళ్లుగా చర్చ పెడుతున్నది. కానీ, దీనిపై ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌లోని చాలా మంది నేతలకకు గాంధీలే నాయకత్వం వహించాలనే అభిప్రాయాలు ఉన్నాయని వివరించాయి. ఇప్పటికే వర్గపోరులతో అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్‌ను ఐక్యం చేయడానికి గాంధీలకు మాత్రమే సాధ్యం అవుతుందనే అభిప్రాయాలు వారిలో ఉన్నాయని పేర్కొన్నాయి. అధ్యక్ష ఎంపికకు ఎన్నికలు పూర్తయితే.. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, ఇతర పార్టీ పోస్టులకూ ఎన్నికలు జరుగుతాయని ఆ వర్గాలు వివరించాయి.

రాహుల్ గాంధీ 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, జనరల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 543 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కేవలం 52 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ దారుణ వైఫల్యాన్ని బాధ్యతగా తీసుకుంటూ రాహుల్ గాంధీ 2019 మే నెలలో రాజీనామా చేశారు. ఆ తర్వాత అనివార్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు పట్టారు. ఇప్పటికీ ఆమె మధ్యంతర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మార్చి నెలలోనూ ఆమె ఎన్నికల వైఫల్యం తర్వాత తన రాజీనామాను ఆఫర్ చేశారు. కానీ, పార్టీ  నేతలు ఆమెను మరికొంత కాలం అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ తన ఫోకస్‌ను భారత్ జోడో (యునైట్ ఇండియా) కార్యక్రమంపై పెట్టారు. ఈ యాత్ర సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటూ 15 రోజుల పాటు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. సుమారు 3,500 కిలోమీటర్ల దూరాన్ని ఈ యాత్ర కవర్ చేయనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios