Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయింది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 19న కౌంటింగ్ నిర్వహించనున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

Election for Congress President post to be held on 17th October
Author
First Published Aug 28, 2022, 4:13 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్ 22న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ అభ్యర్థులు నామినేషన్లు దాఖలైన సందర్భంలో మాత్రమే ఎన్నిక అనివార్యం కానుంది. నేడు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ సమేశంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు వర్చువల్‌గా పాల్గొన్నారు. 

ఇంకా ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పి చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, జీ-23 అసమ్మతి గ్రూపులో భాగమైన ఆనంద్ శర్మ.. తదితరులు పాల్గొన్నారు.

ఇక, గత కొన్ని వారాలుగా కాంగ్రెస్ అద్యక్ష ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన తన రాజీనామా లేఖలో ఆజాద్.. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘పార్టీ మొత్తం సంప్రదింపుల యంత్రాంగాన్ని కూల్చివేసారు’’ రాహుల్ గాంధీ కూల్చివేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనున్నట్టుగా గత ఏడాది అక్టోబర్‌లోనే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండకూడదనే పట్టుదలతో ఉన్నారని పార్టీలోని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఆ బాధ్యతల్లో కొనసాగడం ఇష్టపడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ముందున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిపై స్పందించిన అశోక్ గెహ్లాట్.. ఆ రిపోర్ట్స్‌ను తగ్గించాలని కోరారు. రాహుల్ గాంధీని మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు గాంధీ కుటుంబం అయిష్టత వ్యక్తం చేస్తుందనే వార్తల నేపథ్యంలో.. ఈ సారి ఎవరూ ఆ బాధ్యతలు చేపట్టనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీల షెడ్యూల్:
నోటిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 22
నామినేషన్ దాఖలు తేదీలు: సెప్టెంబర్ 24 ఉదయం 11 నుంచిసెప్టెంబర్ 30 మధ్యాహ్నం 3 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 1
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
ఎన్నికల తేదీ (అవసరమైతే): అక్టోబర్ 17 ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య
కౌంటింగ్ మరియు ఫలితాన్ని ప్రకటించే తేదీ (అవసరమైతే): అక్టోబర్ 19 

Follow Us:
Download App:
  • android
  • ios