చండీగఢ్: ఎన్నికలొచ్చాయంటే చాలు రాజకీయపార్టీలు వారి అభ్యర్థులు చేసే ఫీట్లకు ఆకాశమే హద్దు. ఎన్నికల వేళ వారి సందడి, కోలాహలం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కొందరు అభ్యర్థులిచ్చే హామీలకైతే యావత్ దేశ బడ్జెట్ కూడా సరిపోదు. ఓట్ల కోసం వారి పాట్లను చూస్తే కొన్నిసార్లు నువ్వుకూడా వస్తుంది. 

చిన్నపిల్లలకు స్నానం చేపించడం నుంచి మొదలు సెలూన్ లో కటింగ్ చేయడం వరకు వారు చేయని పని ఉండదు, ఎత్తని అవతారం ఉండదు. హర్యానాలో కూడా ఎన్నికల వేళ ఇలాంటి ఒక వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. 

హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్ జిల్లా హొడల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తలపైన బూటు పెట్టుకొని వినూత్న ప్రచారానికి తెర తీశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని బీజేపీ నుంచి బరిలో నిలిచిన జగదీశ్ నాయర్ తలపై బూటు తో ప్రచారం సాగిస్తున్నాడు.

గతంలో ఒక వర్గం ప్రజలపట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంవల్ల వారు ఈ సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహంగా ఉన్నారట. వారిని ప్రసన్నం చేసుకునేందుకే ఈ నూతన ఎత్తుగడ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ సదరు ఎమ్మెల్యే గారు మాత్రం, తాను ఎవ్వరినీ కించపరచలేదని, తనను గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని ప్రజలను ఒప్పించేందుకు ఇలా ప్రచారం చేస్తున్నట్టు చెబుతున్నాడు.